కలం, కరీంనగర్ బ్యూరో : కరీంనగర్లో(Karimnagar) ఇస్కాన్(ISKCON) శ్రీ జగన్నాథ రథయాత్ర ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీ జగన్నాథ రథయాత్ర (Sri Jagannath Rath Yatra) వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. భక్తుల కోలాహలం, హరేకృష్ణ నామస్మరణల మధ్య రథయాత్ర అత్యంత భక్తిశ్రద్ధలతో సాగింది. ఈ పవిత్ర కార్యక్రమంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్, కరీంనగర్ నగరపాలక సంస్థ మేయర్ కొలగాని శ్రీనివాస్, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, నగర డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్ రావు పాల్గొని స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. రథయాత్ర సందర్భంగా ఇస్కాన్ ప్రతినిధులు నిర్వహించిన కీర్తనలు, ఆధ్యాత్మిక ప్రవచనాలు, సంకీర్తనలు భక్తులను ఆకట్టుకున్నాయి. స్వామివారికి చప్పన్ భోగ్, మహా హారతి కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు.
ఈ వేడుకలకు కరీంనగర్ నగరంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ‘హరే కృష్ణ హరే కృష్ణ.. కృష్ణ కృష్ణ హరే హరే.. హరే రామ హరే రామ.. రామ రామ హరే హరే’ అనే మహామంత్ర నామసంకీర్తనలతో కరీంనగర్ వీధులు మార్మోగాయి. ఈ కార్యక్రమంలో 50వ డివిజన్ కార్పొరేటర్ బోయినిపల్లి ప్రవీణ్ కుమార్ రావు, 22వ డివిజన్ కార్పొరేటర్ బండ రమణారెడ్డి, శ్రీ జగన్నాథ రథయాత్ర ఉత్సవ కమిటీ సభ్యులు, భక్తులు, ప్రజలు పాల్గొన్నారు.

