కలం, వెబ్ డెస్క్: టీమిండియా స్టార్ విరాట్ కోహ్లీ (Virat Kohli) మరో అరుదైన మైలురాయిని చేరుకున్నాడు. ఇంగ్లండ్‌తో రెండో వన్డేలో బరిలోకి దిగిన కోహ్లీ, 561వ అంతర్జాతీయ మ్యాచ్ ఆడాడు. దీంతో ఆస్ట్రేలియా దిగ్గజం రికీ పాంటింగ్ 560 మ్యాచ్‌ల రికార్డును అధిగమించాడు. అత్యధిక అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన ఆటగాళ్ల జాబితాలో కోహ్లీ ఐదో స్థానానికి చేరాడు. ఈ జాబితాలో సచిన్ టెండూల్కర్ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. ఆయన తర్వాత మహేళ జయవర్ధనే, కుమార సంగక్కర, సనత్ జయసూర్య ఉన్నారు.
ఈ మైలురాయిని కోహ్లీ మరో అర్ధశతకంతో గుర్తుండిపోయేలా చేసుకున్నాడు. 66 బంతుల్లో 65 పరుగులు చేశాడు. అయితే వరుసగా రెండో వన్డేలో కూడా జోఫ్రా ఆర్చర్ బౌలింగ్‌లోనే ఔటయ్యాడు. ఇన్నింగ్స్‌లో మొదట రోహిత్ శర్మతో 60 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన కోహ్లీ, తర్వాత శ్రేయస్ అయ్యర్‌తో మరో 67 పరుగులు జోడించి భారత్‌ను బలమైన స్థితిలో నిలిపాడు. ఈ అర్ధశతకంతో మరో రికార్డు కూడా కోహ్లీ ఖాతాలో చేరింది.
ఇంగ్లండ్‌పై వన్డేల్లో 50కి పైగా స్కోర్లు చేసిన సంఖ్య 14కు చేరింది. దీంతో వెస్టిండీస్ దిగ్గజం వివ్ రిచర్డ్స్ రికార్డును సమం చేశాడు. ఈ జాబితాలో 15 యాభై ప్లస్ స్కోర్లతో కుమార సంగక్కర మాత్రమే కోహ్లీ కంటే ముందున్నాడు. 2008లో అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టిన కోహ్లీ, ఇప్పటివరకు 28 వేలకుపైగా పరుగులు సాధిస్తూ తన నిలకడను మరోసారి చాటుకున్నాడు.

