Mobile Popup Ad
Mobile Popup Ad

సత్తుపల్లిలో మళ్లీ భగ్గుమన్న పోడు భూముల వివాదం

కలం, ఖమ్మం బ్యూరో: ఖమ్మం(Khammam) జిల్లా సత్తుపల్లి (Sathupalli) మండలంలోని కాకర్లపల్లి అటవీ ప్రాంతంలో పోడు భూముల వివాదం మరోసారి ఉద్రిక్తతకు దారితీసింది. అటవీ హక్కుల కోసం గిరిజనులు, అటవీ భూముల రక్షణ కోసం అధికారులు పట్టుబట్టడంతో కాకర్లపల్లి అడవులు రణరంగాన్ని తలపించాయి. తామరచెరువు సమీపంలోని కంపార్ట్‌మెంట్ నంబర్-157 పరిధిలో ఉన్న సుమారు 10.5 హెక్టార్ల అటవీ భూమి పూర్తిగా ప్రభుత్వానికి చెందినదేనని అటవీశాఖ అధికారులు స్పష్టం చేశారు. ఈ భూమిలోకి ఎవరూ ప్రవేశించకుండా సరిహద్దుల వెంట ట్రెంచ్‌లు తవ్వించారు. అయితే, దశాబ్దాలుగా ఇక్కడే పోడు సాగు చేస్తున్నామని, తమ జీవనాధారం అయిన భూమిని వదిలిపెట్టబోమని గిరిజనులు పేర్కొంటూ నిరసనకు దిగారు.

అధికారులు తవ్వించిన ట్రెంచ్‌లను గిరిజనులు పూడ్చివేసి పోడు సాగుకు ప్రయత్నించడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. సమాచారం అందుకున్న అటవీశాఖ సిబ్బంది అక్కడికి చేరుకుని వారిని అడ్డుకున్నారు. ఈ సందర్భంగా నిబంధనలను ఉల్లంఘించారనే ఆరోపణలతో ఇద్దరు గిరిజనులను అదుపులోకి తీసుకున్నారు. దీంతో పెద్ద సంఖ్యలో గిరిజన మహిళలు సంఘటనా స్థలానికి చేరుకుని అటవీశాఖ అధికారుల వాహనాన్ని చుట్టుముట్టారు. అదుపులోకి తీసుకున్న వారిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేపట్టారు. ఇరువర్గాల మధ్య వాగ్వాదం తీవ్రరూపం దాల్చి తోపులాటకు దారితీసింది. ఈ ఘటనలో ఒక మహిళా అటవీశాఖ అధికారికి చేతికి గాయమైంది. ఘర్షణతో అటవీ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

ఈ సందర్భంగా అటవీశాఖ అధికారులు మాట్లాడుతూ, అడవుల రక్షణ కోసం ప్రభుత్వ నిధులతో తవ్వించిన ట్రెంచ్‌లను పూడ్చివేయడం వల్ల సుమారు రూ.లక్ష వరకు నష్టం జరిగిందని తెలిపారు. గతంలో అర్హులైన పలువురు గిరిజనులకు పోడు పట్టాలు మంజూరు చేశామని, మిగిలిన అటవీ భూములను ఆక్రమించుకునేందుకు కొందరు కావాలనే వివాదాలు సృష్టిస్తున్నారని ఆరోపించారు. ఏళ్లుగా కొనసాగుతున్న సత్తుపల్లి పోడు భూముల సమస్యకు ఇప్పటికీ శాశ్వత పరిష్కారం లభించకపోవడంతో స్థానికులలో  ఆందోళన వ్యక్తమవుతోంది. తాజా ఘటనతో మరోసారి ఈ వివాదం చర్చనీయాంశంగా మారింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>