ఇండియా కూటమి పార్టీలపై రాహుల్ అసంతృప్తి

కలం, వెబ్ డెస్క్: ఇండియా కూటమి పార్టీలపై లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ (Rahul) అసంతృప్తి వ్యక్తం చేసినట్టు సమాచారం. వోట్ చోరీ, సర్ ప్రక్రియ అంశాలపై తనకు కూటమి పార్టీలు మద్దతు ఇవ్వలేదని ఆయన అసహనం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. 15 నిమిషాలు మాత్రమే మాట్లాడిన రాహుల్.. ఇతర పార్టీలపై అసహనం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. సోమవారం ఢిల్లీలో ఇండియా కూటమి భాగస్వామ్య పక్షాలు సమావేశమయ్యాయి. ఈ సమావేశంలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. కూటమి భాగస్వామ్య పక్షాలకు చురకలు అంటించినట్టు సమాచారం.  “కలిసుంటే బలపడతాం.. విడిపోతే దెబ్బతింటాం” అంటూ రాహుల్ పేర్కొన్నారు. బీజేపీని ఎదుర్కోవాలంటే భాగస్వామ్య పార్టీలు పరస్పర విమర్శలకు దూరంగా ఉండి ఐక్యంగా పనిచేయాలని ఆయన సూచించారు.

నాకు ఎందుకు మద్దతు ఇవ్వలేదు

కూటమిలోని కొన్ని పార్టీలు “ఓటర్ జాబితాల అక్రమాల” (వోట్ చోరీ) అంశంపై తగిన మద్దతు ఇవ్వలేదని అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. కూటమిలో భాగస్వాములుగా ఉంటూనే కాంగ్రెస్‌ను తరచూ విమర్శించే పార్టీల వైఖరిపైనా ఆయన ఆక్షేపణ వ్యక్తం చేశారు. వామపక్షాలు, తృణముల్ కాంగ్రెస్ తీరుపై రాహుల్ అసహనం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (ఎస్‌ఐఆర్) ప్రక్రియ, ఓటరు జాబితాల అవకతవకలపై తీవ్ర ఆందోళనలు ఉన్నాయని పేర్కొంటూ, ఈ అంశంపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి అధికారికంగా లేఖ రాయాలని ఇండియా కూటమి నిర్ణయించింది. వీలైనంత త్వరగా ఆ లేఖను సమర్పించాలని ఏకాభిప్రాయానికి వచ్చింది.

బీజేపీని ఓడించడం కష్టమేమీ కాదు

బీజేపీని ఓడించడం కష్టమైన విషయం కాదని, గత లోక్‌సభ ఎన్నికల ఫలితాలే దీనికి నిదర్శనమని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. పరస్పర విభేదాలు, అంతర్గత పోరాటాలతో ప్రతిపక్షమే తనను తాను బలహీనపరుచుకోకూడదని హెచ్చరించారు. ఇటీవల లోక్‌సభలో ప్రతిపక్ష ఐక్యతకు నిదర్శనంగా నిలిచామని ఖర్గే ప్రస్తావించారు. నియోజకవర్గాల పునర్విభజన (డిలిమిటేషన్) బిల్లును బిల్లులను ప్రతిపక్షాలు ఐక్యంగా వ్యతిరేకించాయని గుర్తు చేశారు. అదే స్ఫూర్తితో ముందుకు సాగాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు.

తాజా రాజకీయ పరిస్థితులపై చర్చ

నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం జరిగిన ఈ సమావేశంలో రాజకీయ పరిస్థితులపై కూడా చర్చ జరిగినట్టు సమాచారం. అసోం, పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ ప్రభుత్వాలను ఏర్పాటు చేయగా, కేరళలో కాంగ్రెస్ విజయం సాధించింది. తమిళనాడులో నటుడు విజయ్ నాయకత్వంలోని పార్టీ మంచి ఫలితాలు సాధించింది. మూడేళ్ల క్రితం ఏర్పడిన ఇండియా కూటమి ఇకపై ప్రతి రెండు నెలలకు ఒకసారి సమావేశం కావాలని నిర్ణయించింది. తదుపరి సమావేశం ఆగస్టులో హైదరాబాద్‌లో నిర్వహించనున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>