బూర్గంపాడులో ఇసుక మాఫియా గుట్టురట్టు…టాస్క్ ఫోర్స్ మెరుపు దాడులు!

కలం, ఖమ్మం బ్యూరో: ​భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు (Burgampadu)లో అక్రమ ఇసుక దందాను అరికట్టే లక్ష్యంతో టాస్క్ ఫోర్స్ అధికారులు మెరుపు దాడులు నిర్వహించారు. నిబంధనలకు విరుద్ధంగా, రహస్యంగా నిల్వ ఉంచిన భారీ ఇసుక నిల్వలను గుర్తించి సీజ్ చేయడంతో స్థానిక ఇసుక మాఫియా గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ​చట్ట విరుద్ధంగా ఇసుకను నిల్వ చేస్తున్నారనే పక్కా సమాచారంతో రంగంలోకి దిగిన టాస్క్ ఫోర్స్ అధికారులు, స్థానిక మైనార్టీ పాఠశాల సమీపంలో తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. ఎటువంటి అనుమతులు లేకుండా, నిబంధనలను తుంగలో తొక్కి నిల్వ ఉంచిన సుమారు 30 ట్రాక్టర్ల ఇసుకను అధికారులు గుర్తించారు. తక్షణమే ఆ నిల్వలను సీజ్ చేసి, తదుపరి చర్యల నిమిత్తం స్థానిక పోలీసులకు అప్పగించారు.

​ఈ అక్రమ ఇసుక నిల్వల వెనుక ఒక ప్రభుత్వ ఉద్యోగి హస్తం ఉన్నట్లు తెలుస్తోంది. సదరు ఉద్యోగి తన పలుకుబడిని ఉపయోగించి, మాఫియాకు సహకరిస్తూ ఈ దందాను సాగిస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అధికారుల విచారణలో ఆ ‘సూత్రధారి’ ఎవరనేది తేలితే మరిన్ని కీలక విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉంది. ఇసుక మాఫియా వెనుక ఎంతటి వారున్నా వదిలే ప్రసక్తే లేదని, అక్రమ రవాణాపై నిరంతరం నిఘా ఉంటుందని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఈ మెరుపు దాడులతో బూర్గంపాడులో ఇసుక అక్రమార్కుల ఆటలకు బ్రేక్ పడుతుందా లేదా వేచి చూడాల్సిందే.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>