కలం, వెబ్ డెస్క్: హైవేలపై అత్యవసర వైద్య సేవలకు (Highway Ambulances) సంబంధించి నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) కీలక నిర్ణయం తీసుకున్నది. ప్రమాద బాధితులకు ‘గోల్డెన్ అవర్’లో తక్షణ సహాయం అందించేందుకు కొత్త రూల్స్ అమల్లోకి తెచ్చింది. దీని ప్రకారం.. ప్రమాద స్థలానికి అంబులెన్స్ 10 కిలోమీటర్ల పరిధిలో ఉంటే ఎమర్జెన్సీ కాల్ (టికెట్) అంగీకరించిన 10 నిమిషాల లోపు అక్కడికి చేరుకోవాలి. లేదంటే అంబులెన్స్ ఆపరేటర్లపై ప్రతి సంఘటనకు రూ. 10 వేల చొప్పున జరిమానా విధిస్తారు. ఎమర్జెన్సీ కాల్స్‌ను రిజెక్ట్ చేసినా ఈ జరిమానా వర్తిస్తుందని ఎన్‌హెచ్‌ఏఐ హెచ్చరించింది.
దూరం ఎక్కువైతే..
ఒకవేళ దూరం 10 కిలోమీటర్ల కంటే ఎక్కువగా ఉంటే, ఆ దూరానికి అనుగుణంగా కాలపరిమితిని పెంచుతారు. అంబులెన్స్ ఎప్పుడు బయలుదేరింది. ప్రమాద స్థలానికి ఎప్పుడు చేరుకుంది అన్నది జీపీఎస్ డేటా ఆధారంగా పర్యవేక్షిస్తారు.
గంటలోపు ఆస్పత్రికి చేర్చాలి..
ప్రమాద స్థలానికి చేరుకోవడంతో అంబులెన్స్ బాధ్యత అయిపోదు. ఎమర్జెన్సీ టికెట్ను అంగీకరించిన గంట లోపు సమీపంలోని ఆస్పత్రికి తరలించాలి. ఈ నిబంధనను పాటించడంలో విఫలమైనా రూ.10 వేల జరిమానా పడుతుంది.
వైద్య పరికరాలు లేకపోతే..
అంబులెన్స్‌లో అవసరమైన వైద్య పరికరాలు, మందులు, శిక్షణ పొందిన సిబ్బంది తప్పనిసరిగా ఉండాలి. వీటిలో ఏ లోపాలు ఉన్నా.. రూ.10 వేల జరిమానా విధిస్తారు.
జీపీఎస్ ట్రాకింగ్..
ఎన్‌హెచ్‌ఏఐ పరిధిలో ప్రస్తుతం 50 వేల కి.మీ. మేర జాతీయ రహదారులు ఉన్నాయి. వీటిపై 3 వేల అంబులెన్సులు, వెయ్యి పెట్రోలింగ్ వాహనాలు, క్రేన్లు అందుబాటులో ఉన్నాయి. వీటన్నింటికీ ఏఐఎస్-140 కంప్లైంట్ జీపీఎస్ పరికరాలు ఏర్పాటు చేశారు. అలాగే ఒక్కో వాహనంలో ఐఓటీ సిమ్తో కూడిన ఆండ్రాయిడ్ మొబైల్ ఉంటుంది. వీటి ద్వారా వాహనాల కదలికలు, ఘటనలకు సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షించవచ్చు.
1033 హెల్ప్ లైన్..
జాతీయ రహదారులపై ప్రయాణించే వారు ఎలాంటి అత్యవసర పరిస్థితుల్లోనైనా తక్షణ సహాయం కోసం 1033 నేషనల్ హైవే హెల్ప్ లైన్ నంబర్ కు కాల్ చేయవచ్చు.

