కలం, మెదక్ బ్యూరో : తన మాటలను వక్రీకరిస్తూ ప్రతిపక్షాలు నిరుద్యోగులను తప్పుదారి పట్టిస్తున్నాయని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు (Sridhar Babu) మండిపడ్డారు. అందరికీ కేవలం ప్రభుత్వ ఉద్యోగాల కల్పన మాత్రమే సాధ్యం కాదని, అందుకే ప్రైవేటు రంగంలో కూడా ఉద్యోగాలు ఇప్పించే ప్రయత్నం చేస్తున్నామని తాను మండలిలో చెప్పినట్లు ఆయన వివరించారు. ఈ వాస్తవాన్ని బీఆర్ఎస్ పార్టీ వక్రీకరించి నిరుద్యోగులను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తోందని ఆయన విమర్శించారు.
సంగారెడ్డి జిల్లాలోని ఐఐటీ హైదరాబాద్‌లో నిర్వహించిన ఎలాన్ విజన్ కల్చరల్ ఫెస్ట్ కార్యక్రమానికి మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జాబ్ క్యాలెండర్‌పై బీఆర్ఎస్ నేతలు మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందని ఎద్దేవా చేశారు. గత తొమ్మిదేళ్ల పాలనలో ఆ పార్టీ ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదని ఆరోపించారు.
తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు లక్షల ఉద్యోగాల భర్తీ లక్ష్యంతో ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్తున్నామని మంత్రి స్పష్టం చేశారు. ఇప్పటివరకు గ్రూప్ 1, 2, 3, 4 కేటగిరీల ద్వారా దాదాపు 70 వేల ఉద్యోగాలను భర్తీ చేశామని వెల్లడించారు. నిరుద్యోగులు ఎవరూ ఆందోళన చెందవద్దని, త్వరలోనే పూర్తిస్థాయి జాబ్ క్యాలెండర్‌ను ప్రకటించి నియామకాలు చేపడతామని శ్రీధర్ బాబు భరోసా ఇచ్చారు.

Read Also: సార్లూ.. జర మా భాష నేర్చుకోండి!
Follow Us On: Sharechat


