కలం, మెదక్ బ్యూరో : వికారాబాద్ జిల్లా మర్పల్లిలో హోటల్ భవనం పైకప్పు కూలిన ఘటనలో గాయపడ్డ వారిని శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ (Telangana Speaker Gaddam Prasad Kumar) పరామర్శించారు. ఈ ప్రమాదంలో గాయపడిన నలుగురు బాధితులను చికిత్స నిమిత్తం సంగారెడ్డి జిల్లా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి, ప్రైవేట్ ఆసుపత్రులకు తరలించారు. సంగారెడ్డి ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చందన (12), తండ్రి చాద్రు, రమేష్ (25), తండ్రి నరసింహులు లను స్పీకర్ పరామర్శించి వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. బాధితులకు అత్యుత్తమ వైద్య సేవలు అందించాలని జిల్లా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ అనిల్ కుమార్, డీఎంహెచ్ ఓ లలితా దేవిలను స్పీకర్ ఆదేశించారు.
అనంతరం గోకుల్ ప్రైవేట్ ఆసుపత్రి లో చికిత్స పొందుతున్న ఎం.డి. నజీర్ (17), బాలాజీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఎం. శివకుమార్ (25) లను స్పీకర్ పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితిపై సంబంధిత వైద్యులను అడిగి తెలుసుకొని, మెరుగైన చికిత్స అందించాలని ఆసుపత్రి యాజమాన్యాలకు సూచించారు. బాధితులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించిన స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్.. వారికి అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని భరోసా నిచ్చారు.

