డిలీట్ అయిన ఓటర్లే టార్గెట్.. పొలిటికల్ పార్టీల బిగ్ ప్లాన్!

కలం, తెలంగాణ బ్యూరో: ‘సర్’ (Telangana SIR) ప్రక్రియలో భాగంగా రాష్ట్రంలో ఊహించని పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ముసాయిదా జాబితాలో డిలీట్ అయిన 93 లక్షల మందిలో నోటీసులు అందుకుని తగిన డాక్యుమెంట్లతో వెరిఫికేషన్ పూర్తి చేసుకున్నవారిలో దాదాపు 44 లక్షల మంది తిరిగి చేరే అవకాశమున్నది. దీనికి తోడు ఫామ్-6 ద్వారా కొత్తగా ఓటర్లుగా చేరేందుకు దరఖాస్తు చేసుకున్నవారి సంఖ్య దాదాపు నాలుగున్నర లక్షలు (4,43,183) అని సీఈవో వర్గాలు తెలిపాయి. ఈ నెల 7 వరకు గడువు ఉండటంతో డ్రాఫ్ట్ లిస్టులో వివిధ కారణాలతో డిలీట్ అయిన అర్హులైనవారితో ఫామ్-6 దరఖాస్తులు సమర్పించేలా పార్టీల నాయకులు కసరత్తు మొదలుపెట్టారు.

ఇప్పటివరకు అందిన దరఖాస్తులు తక్కువే అయినా.. రాబోయే నాలుగైదు రోజుల్లో భారీగానే రావచ్చని సీఈవో ఆఫీస్ కూడా అంచనా వేస్తున్నది. దానికి తగినట్లుగానే తగిన వెరిఫికేషన్ కంప్లీట్ చేసి వీలైనంత తొందరగా స్క్రూటినీ ప్రక్రియను ముగించాలనుకుంటున్నది. ఎలాంటి విచారణ లేకుండా తొలగించారని ఆరోపిస్తున్న అర్హులైన ఓటర్లు నాలుగైదు రోజుల్లో అప్లై చేసుకోనున్నారు.

నామమాత్రంగానే స్పందన

ముసాయిదా జాబితాలో గల్లంతైన ఓటర్లలో అర్హులైనవారిని గుర్తించి, గడువులోగా సరైన డాక్యుమెంట్లను సమర్పించి తిరిగి చేరేలా పార్టీ శ్రేణులు, బూత్ లెవెల్ ఏజెంట్లు (బీఎల్ఏ) చొరవ తీసుకోవాలని అన్ని పార్టీల నాయకులు ఇప్పటికే ఆదేశాలు ఇచ్చారు. దీనికి తోడు కొత్తగా ఓటర్లుగా చేరేందుకు ఫామ్-6 ద్వారా అవకాశం ఉన్నందున ఆ రూపంలోనూ అప్లికేషన్లు సమర్పించేలా ప్లాన్ చేస్తున్నాయి. ఇప్పటివరకు అందిన అప్లికేషన్ల సంఖ్యను సీఈవో ఆఫీస్ ప్రకటించి నామమాత్రంగానే స్పందన ఉన్నదని వ్యాఖ్యానించింది.

కొరవడిన బీఎల్వోల సహకారం..

ఎలక్షన్ కమిషన్ ఆధ్వర్యంలో పనిచేస్తున్న బూత్ లెవల్ ఆఫీసర్ల (బీఎల్వో) దగ్గర ఫామ్-6 అప్లికేషన్లను తగినంత సంఖ్యలో ఉంచామని సీఈవో కార్యాలయం చెప్తున్నా ..గ్రౌండ్ లెవెల్లో మాత్రం పరిస్థితి దీనికి భిన్నంగా ఉన్నది. అప్లికేషన్లు తమ దగ్గర లేవంటూ బీఎల్వోలు చెప్తున్నారు. ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచిస్తున్నారు. దీనికి తగిన తీరులోనే ఆన్లైన్ ద్వారా భర్తీ చేయించేలా పార్టీల బీఎల్ఏలు ప్లాన్ చేస్తున్నారు.

అయితే ఆన్లైన్లో దరఖాస్తు చేసేటప్పుడు వివరాలను నమోదు చేసి తగిన డాక్యుమెంట్లను అప్లోడ్ చేయడంలో టెక్నికల్ సమస్యలు వస్తున్నాయని ఓటర్లు అంటున్నారు. ఒకవైపు ఫిజికల్ అప్లికేషన్లను అవసరానికి తగినంతగా ఉంచకపోవడం, ఆన్లైన్లో అప్లై చేసేటప్పుడు వెబ్సైట్లో వచ్చే ఇబ్బందులతో అర్హులైన ఓటర్లు ఫైనల్ లిస్టులో చేరడానికి ఇబ్బందులు వస్తున్నాయి. ఫలితంగా భారీ సంఖ్యలోనే అర్హులైన ఓటర్లు కూడా జాబితాలో లేకపోయే అవకాశానికి దారితీస్తున్నది. ఇంటి దగ్గరకే బీఎల్వోలు వెళ్లాలంటూ కేంద్ర ఎన్నికల సంఘం చెప్తున్నా క్షేత్రస్థాయిలో మాత్రం ఆ తరహాలో పనితీరు లేకపోవడంతో అర్హులైన ఓటర్లకు అన్యాయం జరుగుతున్నది. ఈ పరిస్థితిని అధిగమించడంపై ఇప్పుడు పార్టీలు దృష్టి సారించాయి.

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>