కలం, కరీంనగర్ : ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఆహార భద్రతా శాఖ అధికారుల (Fake Food Safety Officers) పేరుతో కొంతమంది నకిలీ కేటుగాళ్లు దందాలకు తెగబడుతున్నారు. హోటళ్లు, స్వీట్ షాపులు, బేకరీలు, రెస్టారెంట్లు మాత్రమే కాకుండా ప్రభుత్వ వసతి గృహాలను (హాస్టళ్లు) సైతం లక్ష్యంగా చేసుకుని డబ్బులు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు తీవ్ర కలకలం రేపుతున్నాయి.
నకిలీ తనిఖీల పర్వం.. అసలు ఏం జరుగుతోంది?
ఇటీవలి కాలంలో కరీంనగర్ (Karimnagar) టౌన్, హుజూరాబాద్, జమ్మికుంట, చొప్పదండి, కొత్తపల్లి, శంకరపట్నం తదితర ప్రాంతాల్లో ఈ రకమైన మోసపూరిత సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ఎలాంటి అధికారిక గుర్తింపు కార్డులు చూపించకుండా వ్యాపార సంస్థల్లోకి నేరుగా వెళ్లడం, ఆహార పదార్థాలను పరిశీలించినట్లు నటిస్తూ ఫొటోలు తీయడం చేస్తున్నారు.
హాస్టల్ వార్డెన్లకు ఫోన్ కాల్స్..బ్లాక్‌మెయిలింగ్ డిమాండ్లు
సేకరించిన శాంపిళ్లలో లోపాలు ఉన్నాయని లేదా కేసులు నమోదు చేస్తామని బెదిరిస్తూ, డబ్బులు ఇవ్వకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని వ్యాపారులపై ఒత్తిడి తెస్తున్నారు. ఇటీవల తిమ్మాపూర్‌లోని ఒక ప్రభుత్వ వసతి గృహ వార్డెన్‌కు ఒక ఫోన్ నెంబర్ నుంచి కాల్ వచ్చింది. అవతలి వ్యక్తి తాను ఆహార భద్రతా శాఖకు చెందిన అధికారిగా పరిచయం చేసుకుని డబ్బులు డిమాండ్ చేసినట్లు తెలిసింది.
సిబ్బంది కొరతే దగాకోరులకు ఆసరా?
ఉమ్మడి జిల్లా పరిధిలో అధికారికంగా గెజిటెడ్ ఫుడ్ ఇన్స్పెక్టర్గా రోహిత్‌రెడ్డి, ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్‌గా అంకిత్‌రెడ్డి మాత్రమే పనిచేస్తున్నారు. జిల్లాలో తనిఖీలు చేయడానికి సరిపడా సిబ్బంది లేకపోవడాన్ని ఆసరాగా చేసుకుని, కొందరు కేటుగాళ్లు ‘అధికారులమని’ చెప్పుకుంటూ అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారు. నిజమైన అధికారులు విధులు నిర్వహిస్తున్నారా లేదా అనధికారిక వ్యక్తులు చొరబడ్డారా అనే విషయం తెలియక వ్యాపారులు గందరగోళానికి గురవుతున్నారు.
నకిలీ అధికారుల పట్ల అప్రమత్తం.. నిజమైన నిబంధనలేంటి?
నకిలీ అధికారుల దందా పై బాధితులు, అధికారులు వ్యాపారులను అప్రమత్తం చేస్తున్నారు. తనిఖీలకు వచ్చే వ్యక్తుల అధికారిక గుర్తింపు కార్డులు, వివరాలను పరిశీలించిన తర్వాతే సహకరించాలి. ఎవరైనా ఫుడ్ సేఫ్టీ అధికారులమని చెప్పి డబ్బులు డిమాండ్ చేసినా లేదా అనుమానాస్పదంగా ప్రవర్తించినా వెంటనే సంబంధిత శాఖ అధికారులకు ఫిర్యాదు చేయాలి. ఆహార భద్రత పేరుతో బెదిరింపులకు పాల్పడే వారి సమాచారాన్ని 7032087727, 9404893871 నంబర్లకు అందించి, ఉన్నతాధికారులు బాధ్యులపై చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకోవాలని వ్యాపార వర్గాలు కోరుతున్నాయి.

