కలం, వెబ్‌డెస్క్: హైదరాబాద్ నగరంలో ముద్రా లోన్ పేరుతో మోసాలకు (MUDRA Loan Fraud) పాల్పడుతున్న ఓ ముఠాను మల్కాజిగిరి సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఫేస్బుక్లో నకిలీ ముద్రా లోన్ యాడ్స్ పెట్టి, రుణాలు ఇప్పిస్తామంటూ వ్యాపారిని నమ్మించిన నిందితులు అతడి నుంచి ఏకంగా రూ. 4.6 లక్షలు వసూలు చేశారు. లోన్ ప్రాససింగ్ ఫీజు, టీడీఎస్, ఇతర ఛార్జీల పేరుతో డబ్బులు వసూలు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. బాధితుడి ఆధార్, పాన్ కార్డులు కూడా సేకరించినట్లు తెలిపారు. నిందితుల నుంచి రెండు మొబైల్ ఫోన్లు, రెండు సిమ్ కార్డులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ మోసానికి సంబంధించి బీహార్‌కు చెందిన మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నారు. వారి కోసం పోలీసులు గాలింపు చేపట్టారు.
పరారీలో ఉన్న నిందితులను పట్టుకోవడంతో పాటు మోసపోయిన నగదుకు సంబంధించిన లావాదేవీలను గుర్తించేందుకు పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈ సందర్భంగా ప్రజలకు పోలీసులు కీలక సూచనలు చేశారు. సోషల్ మీడియాలో వచ్చే నకిలీ లోన్ యాడ్స్‌ను నమ్మవద్దని, లోన్ ఇప్పిస్తామంటూ ముందస్తుగా ప్రాసెసింగ్ ఫీజు లేదా ఇతర ఛార్జీలు అడిగితే అప్రమత్తంగా ఉండాలని సూచించారు. తెలియని వ్యక్తులతో బ్యాంకు వివరాలు, ఓటీపీలు పంచుకోవద్దని హెచ్చరించారు. సైబర్ మోసానికి గురైతే వెంటనే 1930 హెల్ప్‌లైన్‌కు కాల్ చేయాలని కాల్ చేయాలని సూచించారు.

