కలం, ఖమ్మం బ్యూరో: భద్రాద్రి కొత్తగూడెం (Bhadradri Kothagudem) జిల్లా దుమ్ముగూడెం మండలంలోని సుజ్ఞానపురం, చింతగుప్ప, జిన్నెలగూడెం గ్రామాల్లో మంగళవారం ఎక్సైజ్ శాఖ అధికారులు, సిబ్బంది విస్తృతంగా దాడులు (Liquor Brewing Units ) నిర్వహించారు. గ్రామ శివార్లలో కొందరు అక్రమంగా నాటుసారా తయారు చేస్తూ విక్రయిస్తున్నారనే పక్కా సమాచారంతో అధికారులు ఈ తనిఖీలు చేపట్టారు.
ఈ దాడుల్లో నాటుసారా తయారీకి వినియోగిస్తున్న సుమారు 1,200 లీటర్ల పంచదార పానకంతో పాటు, 20 లీటర్ల తయారైన నాటుసారాను అధికారులు స్వాధీనం చేసుకుని అక్కడికక్కడే ధ్వంసం చేశారు. ఈ అక్రమ కార్యకలాపాలకు పాల్పడుతున్న తయారీదారులపై కేసులు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు.
ఈ తనిఖీల్లో జిల్లా ప్రొహిబిషన్ ఎక్సైజ్ అధికారి ఎ. శ్రీనివాసరెడ్డి, అసిస్టెంట్ ప్రొహిబిషన్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఎన్. శ్రీనివాస్, సీఐలు కిష్టయ్య, పి. రమాదేవి, ఎస్సైలు సీతా రామరాజు, ఎం. విజయభాస్కర్ తో పాటు ఇతర ఎక్సైజ్ సిబ్బంది పాల్గొన్నారు.

