కలం, తెలంగాణ బ్యూరో : కేంద్ర ఎన్నికల కమిషన్ ఏప్రిల్ నెల నుంచి రాష్ట్రంలో (Telangana) చేపట్టనున్న ‘సర్’ (SIR) ప్రక్రియ ఎలా జరగనున్నది? బూత్ లెవల్ ఆఫీసర్ల ఫీల్డ్ విజిట్ సందర్భంగా ఏమేం ప్రశ్నలు అడుగుతారు? ఎలాంటి ఆధారాలు సమర్పించాల్సి ఉంటుంది? వారు సమాధానాలు తీసుకున్న తర్వాత ఏమవుతుంది? ఓటర్ల జాబితాలో పేరు ఉండడానికి, తొలగించడానికి అనుసరించే పద్ధతేంటి? ఇలాంటి సందేహాలపై రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి (CEO) కార్యాలయం నుంచి ఇంకా అధికారికంగా ఎలాంటి వివరణ రాలేదు. కానీ ఈ ప్రక్రియ చేపట్టేటప్పుడు ప్రజల నుంచి వ్యతిరేకత, అలజడి వచ్చే అవకాశముందని మాత్రం పోలీసులు అనుమానిస్తున్నారు. శాంతిభద్రతల సమస్య తలెత్తే అవకాశాలూ లేకపోలేదని అంచనా వేస్తున్నారు. దానికి తగిన విధంగా కల్పించాల్సిన సెక్యూరిటీపై (Security) ఇప్పటికే ప్రాథమిక స్థాయిలో కసరత్తు మొదలైంది.
పశ్చిమబెంగాల్‌కు తెలంగాణ పోలీస్ :
మరో రెండు నెలల్లో అసెంబ్లీ ఎన్నికల జరగనున్న పశ్చిమబెంగాల్‌లో (West Bengal) కొన్ని నెలల క్రితమే సర్ ప్రక్రియ మొదలైంది. కోటిన్నర మందికి పైగా ఓటర్లు జాబితా నుంచి గల్లంతయ్యారని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఇటీవలే ఆరోపించారు. సుప్రీంకోర్టులో (Supreme Court) సైతం కేసు నడుస్తున్నది. ఓటర్ల జాబితా రూపకల్పన సందర్భంగా సర్ ప్రక్రియలో భాగంగా ఇంటింటి సర్వే నిర్వహిస్తున్నప్పుడు ప్రజల నుంచి ఆగ్రహావేశాలు వెల్లువెత్తాయి. భౌతిక దాడులూ జరిగాయి. తమిళనాడులో సైతం ఓటర్ల గల్లంతుపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆరోపణలు చేశారు. హింసాత్మక చర్యలను (Violence) పరిగణనలోకి తీసుకున్న తెలంగాణ పోలీస్ ఇక్కడ అలాంటివి జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై దృష్టి పెట్టారు. తెలంగాణ నుంచి ప్రత్యేక పోలీసు బృందం అక్కడ పర్యటించింది. ఆ రాష్ట్ర పోలీసుల నుంచి వివరాలను సేకరించింది.
తెలంగాణలో రోహింగ్యాల సమస్య :
తెలంగాణలో సర్ (Telangana SIR) ప్రక్రియ సందర్భంగా రోహింగ్యాల (Rohingya) సమస్య తెరమీదకు వచ్చే అవకాశమున్నది. వలస వచ్చినవారు బాలపూర్ సహా పలు ప్రాంతాల్లో పునరావాసం పొందుతున్నారు. వీరు భారత పౌరులు కాకపోవడంతో ఓటు హక్కు ఉండదు. భారత పౌరసత్వానికి సంబంధించి వారి దగ్గర ఎలాంటి ఆధారాలు ఉండే అవకాశం లేకపోవడంతో రోహింగ్యాలను గుర్తించడం బూత్ లెవల్ ఆఫీసర్లకు (BLO) ఎలాంటి ఇబ్బంది ఉండదు. కానీ 2002 నాటి ఓటర్ల జాబితాను సర్ ప్రక్రియకు ఆధారంగా తీసుకుంటున్నందున నివాస ధృవీకరణకు కొన్ని డాక్యుమెంట్లు, ఆధారాలు తప్పనిసరి కానున్నాయి. ఇవి సమకూర్చకపోతే వారిని కూడా రోహింగ్యాల పేరుతో జాబితా నుంచి తొలగిస్తే ఎదురయ్యే అలజడిపైనే పోలీసులు ఎక్కువ ఆలోచిస్తున్నారు. హింసాత్మక చర్యలు, భౌతిక దాడులు జరగకుండా తగిన భద్రత కల్పించడంపై కసరత్తు జరుగుతున్నది.
జిల్లా కలెక్టర్లతో సీఈఓ మీటింగులు :
సర్ ప్రక్రియను సమర్ధవంతంగా, తప్పుల్లేకుండా పూర్తి చేయడంపై రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి దృష్టి సారించారు. ఇప్పటికే ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో అన్ని విభాగాల కార్యదర్శులతో ఒక దఫా మీటింగ్ జరిగింది. జిల్లా ఎన్నికల అధికారులుగా ఉన్న కలెక్టర్లతో సీఈఓ కూడా సమావేశమై చర్చించారు. సర్ ప్రక్రియ ఏ విధంగా జరగనున్నదీ వివరించి ఇంటింటి సర్వే సందర్భంగా సేకరించాల్సిన అంశాలపైనా అవగాహన కలిగించారు. సున్నిత ప్రాంతాల్లో నివాస ధృవీకరణతో పాటు భారత పౌరసత్వాన్ని రుజువు చేసే డాక్యుమెంట్ల విషయంలో ఎదురయ్యే సమస్యలనూ వివరించారు. బూత్ లెవల్ ఆఫీసర్లకు ఫీల్డులో ఎదురయ్యే చిక్కులను గమనంలోకి తీసుకుని తగిన పోలీసు భద్రత కల్పించాల్సిన అవసరాన్ని కూడా నొక్కిచెప్పారు. కేంద్ర ఎన్నికల సంఘం నుంచి వచ్చే ఆదేశాలకు అనుగుణంగా సర్ ప్రక్రియ షెడ్యూలుపై స్పష్టత రానున్నది.
Read Also: హామీ 42%.. గెలిచింది 62%.. ‘మున్సిపోల్స్’లో రిజర్వేషన్
Follow Us On: Sharechat


