మురుగునీటి పునర్వినియోగం: సచివాలయంలో గ్రీన్ ట్యాంకర్లు

కలం, వెబ్ డెస్క్ : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు తాగునీటి సంరక్షణ, శుద్ధి చేసిన మురుగునీటి పునర్వినియోగాన్ని ప్రోత్సహించేందుకు తెలంగాణ సచివాలయం వేదికగా జలమండలి గ్రీన్ వాటర్ ట్యాంకర్ల (Green Water Tankers) సేవలను ప్రారంభించింది. జలమండలి 37వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. నిర్మాణ పనులు, ల్యాండ్‌స్కేపింగ్, గార్డెనింగ్, పార్కుల నిర్వహణ వంటి తాగేతర అవసరాల కోసం ఎస్టీపీల్లో శుద్ధి చేసిన నీటిని వినియోగించేలా ఈ చర్యలు చేపట్టారు.

తొలివిడతలో భాగంగా 19 ఎస్టీపీల నుంచి 28 గ్రీన్ వాటర్ ట్యాంకర్ల ద్వారా అత్తాపూర్, అంబర్‌పేట్, నాగోల్, కోకాపేట్, గోపన్‌పల్లి, మియాపూర్ తదితర ప్రాంతాల్లో ఈ నీటిని సరఫరా చేయనున్నారు. అనంతరం దశలవారీగా ఈ సేవలను నగరవ్యాప్తంగా విస్తరించనున్నారు. ఈ పథకం కింద సరఫరా కోసం జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ, ప్రైవేటు సంస్థలకు చెందిన సుమారు 100 ట్యాంకర్లు నమోదు చేసుకున్నాయి.

వీటికి ప్రత్యేక బ్రాండింగ్, జీపీఎస్ ట్రాకింగ్, ఈ-పీఓఎస్, బుకింగ్ వ్యవస్థలను అనుసంధానించారు. ఈ నీరు తాగడానికి పనికిరాదనే స్పష్టమైన హెచ్చరికలను కూడా ట్యాంకర్లపై ప్రదర్శిస్తారు. రాబోయే ఎల్‌నినో పరిస్థితులను అధిగమించేందుకు, భూగర్భ జలాల పై ఒత్తిడి తగ్గించేందుకు ప్రతి ఒక్కరూ శుద్ధి చేసిన నీటిని వినియోగించాలని జలమండలి ఎండీ కె. అశోక్ రెడ్డి కోరారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>