కలం, వెబ్‌డెస్క్: ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు పోలింగ్ (AP Municipal Polling) కొనసాగుతోంది. మధ్యాహ్నం 3 గంటల వరకు దాదాపు 48.03 శాతం పోలింగ్ నమోదు అయ్యింది. అత్యధికంగా కర్నూలు జిల్లాలోని గూడురులో 73.96 శాతం పోలింగ్ నమోదైంది. అత్యల్పంగా విశాఖ జీవీఎంసీలో 39.72 శాతం పోలింగ్ నమోదైంది. సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ కొనసాగుతుంది. ఏపీలో పోలింగ్ తీరుపై సీఎం చంద్రబాబు (CM Chandrababu) కూటమి నేతలు, టీడీపీ కేడర్‌తో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయని వివరించారు. తక్కువ పోలింగ్ నమోదైన ప్రాంతాలపై ఫోకస్ పెట్టాలని సీఎం సూచించారు.
ఎన్నికల నిబంధనలు పాటిస్తూనే పోలింగ్ శాతం పెంచాలని పిలుపునిచ్చారు. అవాంఛనీయ ఘటనలు జరిగితే వెంటనే అధికారులు, పోలీసుల దృష్టికి తీసుకెళ్లాలని చెప్పారు. ప్రత్యర్థుల రెచ్చగొట్టే చర్యలకు కూటమి శ్రేణులు సంయమనం పాటించాలని చంద్రబాబు సూచించారు. మరోవైపు మంత్రి లోకేశ్ సైతం ఏపీలో ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయని చెప్పారు. అయితే పులివెందులలో మాత్రం అల్లర్లు సృష్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రశాంతంగా ఎన్నికలు జరుగుతున్నప్పుడు అక్కడ మాత్రం గొడవలకు కారణం ఏమిటని ప్రశ్నించారు. గతంలో పులివెందులలో ప్రతి వార్డు ఏకగ్రీవం అయ్యేదని, ఇప్పుడు ఎన్నికలు జరుగుతున్నాయని చెప్పారు. పులివెందులలో గొడవలకు కారణం జగనే అని ఆరోపించారు.

