కలం, స్పోర్ట్స్ : భారత్‌లో విరాట్ కోహ్లీకి (Virat Kohli) ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అలాంటి స్టార్ క్రికెటర్లో ఏమాత్రం గర్వం కనిపించదని న్యూజిలాండ్ పేసర్ జాకబ్ డఫీ (Jacob Duffy) ప్రశంసించాడు. అతడి నిరాడంబరత, పని పట్ల అంకితభావం తనను ఆకట్టుకున్నాయని వెల్లడించాడు. ఐపీఎల్ 2026లో కోహ్లీతో కలిసి ఆర్సీబీ డ్రెస్సింగ్ రూమ్ పంచుకున్న డఫీ.. అతడితో నెట్స్‌లోనూ చాలాసార్లు తలపడ్డాడు. సాధనకు కోహ్లీ ఎప్పుడూ ముందుండేవాడని చెప్పాడు. భారత పిచ్‌లపై బౌలింగ్ చేయాల్సిన వ్యూహాలు, లైన్, లెంగ్త్ మార్పుల గురించి కోహ్లీతో చర్చించినట్లు వెల్లడించాడు. ఆ సూచనలు తనకు ఎంతో ఉపయోగపడ్డాయని తెలిపాడు.
అయితే ఇప్పుడు సీన్ మారబోతోంది. నవంబర్ 4 నుంచి భారత్‌తో జరిగే ఐదు వన్డేల సిరీస్‌లో కోహ్లీకి డఫీ ప్రత్యర్థిగా బరిలోకి దిగనున్నాడు. ఇన్నాళ్లూ కలిసి సాధన చేసిన ఇద్దరూ.. ఇక మైదానంలో తలపడనున్నారు. కోహ్లీని ఎదుర్కోవడం ఆసక్తికరంగా ఉంటుందని డఫీ అభిప్రాయపడ్డాడు. మరోవైపు 2027 వన్డే ప్రపంచకప్ కోసం న్యూజిలాండ్ ఇప్పటి నుంచే సిద్ధమవుతోంది. దక్షిణాఫ్రికాలో జరగనున్న ఈ మెగా టోర్నీకి జట్టులో చోటు దక్కించుకోవడమే లక్ష్యంగా భారత్‌తో సిరీస్‌ను ఉపయోగించుకోవాలని డఫీ భావిస్తున్నాడు.

