కలం, వెబ్ డెస్క్ : ఢిల్లీలోని రాంలీలా మైదానం వేదికగా ఇండీ కూటమి చేపట్టిన మెగా ర్యాలీ పై కేంద్ర హోంమంత్రి అమిత్ షా (Amit Shah) తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం చండీగఢ్ లో జరిగిన బహిరంగ సభలో ఆయన ప్రతిక్షాలపై విమర్శలు గుప్పించారు. సిక్కు వ్యతిరేక అల్లర్ల వార్షికోత్సవం రోజునే కాంగ్రెస్ ర్యాలీ నిర్వహించడాన్ని షా తప్పుబట్టారు. నవంబర్ 1, 2, 3 తేదీల్లో ర్యాలీలు నిర్వహించవద్దని కోరినా ప్రతిపక్షాలు వినలేదని ఆయన ఆరోపించారు.
1984 నాటి సిక్కుల వ్యతిరేక అల్లర్లకు కాంగ్రెస్ పార్టీయే బాధ్యత వహించాలన్నారు. ఇందిరా గాంధీ హత్య అనంతరం దేశ వ్యాప్తంగా వేలాది సిక్కులను ఊచకోత కోశారని షా (Amit Shah) గుర్తు చేశారు. ఆ దారుణానికి బాధ్యులపై కాంగ్రెస్ చర్యలు తీసుకోలేదని, బాధితులకు న్యాయం చేయడంలో ఆ పార్టీ విఫలమైందని అమిత్ షా ఆరోపించారు. బాధితుల గాయాలపై కారం చల్లడమే లక్ష్యంగా విపక్షాలు జల్సా ర్యాలీ చేస్తున్నాయని ఆయన తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.

