కలం, వెబ్ డెస్క్ : తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా నేడు ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల బంద్ (Telangana Schools Bandh)కు అఖిల భారత విద్యార్థి పరిషత్ (ABVP) పిలుపునిచ్చింది. రాష్ట్రంలో ప్రభుత్వ విద్యా రంగాన్ని నిర్వీర్యం చేసేందుకు ప్రభుత్వం కుట్ర పన్నుతోందని, అందులో భాగంగానే దాదాపు 23 వేల ప్రభుత్వ పాఠశాలలను మూసివేయడానికి విద్యాశాఖ సిద్ధమవుతోందని ఏబీవీపీ నేతలు ఆరోపణలు చేస్తున్నారు.
ప్రభుత్వ పాఠశాలల పరిరక్షణ, విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకునే ఈ బంద్ నిర్వహిస్తున్నట్లు వారు స్పష్టం చేశారు. నేడు ఉదయం నుంచే రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో విద్యాసంస్థలను మూసివేయించేందుకు ఏబీవీపీ కార్యకర్తలు రోడ్లపైకి వస్తున్నారు. విద్యా వ్యవస్థలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని, ప్రభుత్వ పాఠశాలలను కాపాడాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ముందస్తు జాగ్రత్తగా పలు ప్రైవేట్ విద్యాసంస్థలు కూడా నేడు సెలవు ప్రకటించాయి.

