ప్రభుత్వ పాఠశాలల్లో బూట్ల పంపిణీ.. ఇకపై ఈ రూల్స్ తప్పనిసరి!

కలం, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలోని ప్రభుత్వ, స్థానిక సంస్థల పరిధిలో పనిచేస్తున్న విద్యాసంస్థలు, మోడల్ స్కూల్స్, కస్తూర్బా విద్యాలయాలు, అర్బన్ రెసిడెన్షియల్ స్కూల్స్, వాటి కింద నడిపే ప్రీ-ప్రైమరీ మొదలు ఇంటర్ వరకు చదువుతున్న అర్హులైన విద్యార్థులకు పంపిణీ చేస్తున్న నల్ల బూట్ల విషయంలో స్కూల్ ఎడ్యుకేషన్ శాఖ కీలక ఆదేశాలు జారీ చేసింది. బూట్ల పంపిణీ (Shoe Distribution) లో ఎలాంటి నిర్లక్ష్యం, సైజు గందరగోళం, పారదర్శకత లోపం తలెత్తకూడదని స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ స్పష్టం చేశారు.

ఇప్పటికే ఇవి మండలాలకు చేరాయని, అక్కడి నుంచి గ్రామాల్లోని స్కూళ్ల వరకు పంపిణీ అవుతాయని పేర్కొన్నారు. విద్యార్థులకు బూట్లు, సాక్స్ సరిగ్గా సరిపోవాలని, ఫిట్టింగ్ పర్‌ఫెక్టుగా ఉండాలని, తేడాలు ఉండకూడదని, ఇందుకోసం ముందుగానే వారికి ట్రయల్ ద్వారా తేల్చుకోవాలన్నారు. తేడాలు ఉన్నట్లయితే వాటిని మార్చాలని డైరెక్టర్ జారీ చేసిన ఆదేశాల్లో పేర్కొన్నారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు, మండల విద్యాధికారులు, జిల్లా విద్యాధికారులు తప్పనిసరిగా అనుసరించాల్సిన మార్గదర్శకాలను పేర్కొన్నారు.

పిల్లలు తొడిగి చూసిన తర్వాతనే..!

స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం.. బూట్లు ఆయా పాఠశాలకు చేరిన వెంటనే ప్రధానోపాధ్యాయులు ముందుగా సైజుల వారీగా వచ్చిన స్టాక్‌ను తనిఖీ చేసి ప్రత్యేక స్టాక్ రిజిస్టరులో నమోదు చేయాలన్నారు.

ప్రీ-ప్రైమరీ, ప్రాథమిక తరగతులకు సాధారణంగా యూకే 12, 13, 1, 2, 3, 4 సైజుల షూస్ సరిపోతాయని తెలిపారు. హైస్కూల్, ఇంటర్ విద్యార్థులకు 5 నుంచి 9 వరకు సైజులు ఉద్దేశించినప్పటికీ, వాటిని కేవలం సూచనలుగానే పరిగణించాలని, ప్రతి విద్యార్థికి భౌతికంగా కొలిచి, తొడిగించి చూసిన తర్వాతే సరైన సైజును నిర్ణయించాలని స్పష్టం చేశారు. విద్యార్థి స్వయంగా బూట్లు తొడిగి సరిపోతున్నాయో లేదో నిర్ధారించాలన్నారు. ఆ తర్వాతే పంపిణీ చేయాలని చెప్పారు.

కేవలం తరగతి ఆధారంగా లేదా అంచనాలతో బూట్లు ఇవ్వకూడదని స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ స్పష్టంచేశారు. సరైన సైజు వచ్చిన తర్వాత మాత్రమే విద్యార్థి నుంచి రసీదు తీసుకోవాలని, తరగతి ఉపాధ్యాయులకు పంపిణీ బాధ్యత అప్పగించినప్పుడు వారి నుంచి కూడా అంగీకార పత్రం తీసుకోవాలని సూచించారు.

తరగతి వారీగా, విద్యార్థి వారీగా మార్పిడి జాబితా సిద్ధం చేసి, పాఠశాల స్థాయిలో సైజుల వారీగా సమీకరించి మండల విద్యాధికారికి పంపించాలని ఆదేశించారు.

సైజు సరిపోని లేదా మిగిలిపోయిన బూట్లను తిరిగి కార్టన్‌లలోనే ప్యాక్ చేసి, పాఠశాల పేరు, యూడైస్ కోడ్, మండలం, జిల్లా, మొత్తం జతల సంఖ్య, సైజుల వారీ వివరాలను స్పష్టంగా నమోదు చేసి మండల విద్యాధికారికి అప్పగించాలని ఆ ఉత్తర్వుల్లో స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ సూచించారు. పంపిణీ, మిగులు నిల్వలు, స్టాక్‌కు సంబంధించిన అన్ని వివరాలను ప్రత్యేక రిజిస్టరులో నమోదు చేయడం ప్రధానోపాధ్యాయుల బాధ్యతగా పేర్కొన్నారు.

మండల విద్యాధికారులు తమ పరిధిలోని అన్ని పాఠశాలల నుంచి సైజు మార్పిడి వివరాలను సేకరించి ధ్రువీకరించిన తర్వాత జిల్లా విద్యాధికారికి పంపించాలని, తిరిగి వచ్చిన కొత్త స్టాక్‌ను భద్రంగా నిల్వ చేయడంతో పాటు పూర్తి పంపిణీ ప్రక్రియ పూర్తయ్యే వరకు బాధ్యతగల అధికారిని నియమించాల్సి ఉంటుందన్నారు. మండల స్థాయిలో స్టాక్ రిజిస్టర్, పంపిణీ రిజిస్టర్, రీప్లేస్‌మెంట్ రిజిస్టర్, వినియోగ ధ్రువీకరణ పత్రాలను తప్పనిసరిగా నిర్వహించాలని ఆదేశించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>