అర్హులెవ్వరికీ అన్యాయం జరగొద్దు.. రివ్యూలో మంత్రి పొంగులేటి

కలం, తెలంగాణ బ్యూరో: నిషేధిత జాబితాలో ఉన్న భూముల విషయంలో అర్హులెవ్వరికీ అన్యాయం జరగకుండా చర్యలు తీసుకోవాలని రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లను రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి (Ponguleti Srinivasa Reddy) ఆదేశించారు. అర్హుల హక్కులను కాపాడుతూ సర్కార్ భూములను పరిరక్షించడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. 22-ఏ అంశానికి సంబంధించిన అన్ని దరఖాస్తులు, ఫిర్యాదులను నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని సూచించారు.

‘క్యూర్’ పరిధిలోని 22-ఏ నిషేధిత భూముల అంశంపై సచివాలయంలో బుధవారం నిర్వహించిన ఉన్నతస్థాయి సమీక్ష సందర్భంగా అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. వివాదాలు లేని ప్రైవేట్ భూములను ప్రభుత్వం నిషేధిత జాబితాలో చేర్చిందన్న ప్రచారంలో వాస్తవం లేదని మీడియాకు వివరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్దేశపూర్వకంగా ఒక్క సెంటు భూమిని కూడా నిషేధిత జాబితాలో చేర్చలేదని మంత్రి స్పష్టం చేశారు.

రాష్ట్రమంతటికీ ఒకే ఫార్ములా..

ప్రస్తుత సమావేశం ‘క్యూర్’ పరిధి జిల్లాలకు సంబంధించినదే అయినా ఇక్కడ తీసుకున్న నిర్ణయాలు, అధికారులకు ఇచ్చిన ఆదేశాలు రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు వర్తిస్తాయని మంత్రి స్పష్టం చేశారు. వాటిని జిల్లాల కలెక్టర్లు, రెవెన్యూ, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ అధికారులు తప్పనిసరిగా అమలు చేయాలన్నారు. తహసీల్దార్ నుంచి కలెక్టర్‌‌ స్థాయి వరకు వచ్చిన ప్రతి దరఖాస్తును సమగ్రంగా పరిశీలించాలని సూచించారు. ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులనూ వెంటనే పరిష్కరించాలన్నారు.

నిషేధిత జాబితాలోని భూముల వివాదాల పరిష్కారానికి హైకోర్టు నిర్దేశించిన 45 రోజుల గడువులోనే అన్ని ప్రక్రియలు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అక్రమ లావాదేవీలు, అక్రమ రిజిస్ట్రేషన్లు, ఆక్రమణలు జరగకుండా అప్రమత్తంగా ఉండాలని మంత్రి సూచించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>