Mobile Popup Ad
Mobile Popup Ad

ప్రభుత్వ నిబంధనల ప్రకారమే ధాన్యం సేకరణ : రైతు కమిషన్ చైర్మన్ కోదండ రెడ్డి

కలం, నల్లగొండ బ్యూరో : నల్లగొండ(Nalgonda) జిల్లాలో ధాన్యం కొనుగోలు ప్రక్రియలో ఎలాంటి అక్రమాలు సహించబోమని రాష్ట్ర రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ ఎమ్. కోదండ రెడ్డి (Kodanda Reddy)  హెచ్చరించారు. ప్రభుత్వం రూపొందించిన విధివిధానాల ప్రకారమే ధాన్యం సేకరణ జరగాలని ఆయన స్పష్టం చేశారు. శనివారం ఆయన జిల్లా కేంద్రం సమీపంలోని ఆర్జాలబావి, ఎస్ఎల్‌బీసీ మార్కెట్ యార్డులోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను అధికారులతో కలిసి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ధాన్యపు రాశులు, తేమ, తాలు, తరుగు వంటి అంశాలను పరిశీలించి రైతులతో మాట్లాడారు.

అనంతరం జరిగిన సమావేశంలో ఆయన (Kodanda Reddy) మాట్లాడుతూ.. రైతులు ధాన్యం అమ్మిన తర్వాత మిల్లులకు వెళ్లాల్సిన అవసరం లేదని తెలిపారు. ఒకవేళ ఎవరైనా రైతులను రైస్ మిల్లులకు పంపిస్తే సంబంధిత అధికారులపైనే బాధ్యత ఉంటుందని హెచ్చరించారు. కొనుగోలు కేంద్రంలో రైతు, నిర్వాహకుల మధ్యే వ్యవహారం పూర్తవ్వాలని, మిల్లర్లకు ఇందులో ఎలాంటి పాత్ర ఉండకూడదని ఆయన స్పష్టం చేశారు. ధాన్యం అమ్మిన వెంటనే రైతులకు పక్కా రశీదు ఇవ్వాలని, తరువాత వారి బ్యాంక్ ఖాతాల్లో డబ్బులు జమ చేయాలని సూచించారు. కొనుగోలు కేంద్రం నుంచి మిల్లులకు ధాన్యం తరలించే బాధ్యత పూర్తిగా అధికారులదేనని పేర్కొన్నారు.

తేమ, తాలు, తరుగు సమస్యలు ఉంటే కొనుగోలు కేంద్రంలోనే పరిష్కరించుకోవాలని, మిల్లర్లతో సంబంధం పెట్టుకోవాల్సిన అవసరం లేదని రైతులకు సూచించారు. హామాలి చార్జీల విషయంలో కూడా ప్రభుత్వం నిర్ణయించిన క్వింటాకు రూ.45 మాత్రమే తీసుకోవాలని, అదనంగా వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇక రైతులు తమ సమస్యలను వెల్లడిస్తూ, మిల్లర్లు తరుగు, తాలు పేరుతో అనవసరంగా ఇబ్బందులు పెడుతున్నారని, లారీలను నిలిపివేస్తూ నష్టపరుస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం దీనిపై దృష్టి సారించి తగిన చర్యలు తీసుకోవాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో రైతు సంక్షేమ కమిషన్ సభ్యులు, జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు, రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Read Also: ఆమెకు లైక్ కొట్టిన కోహ్లీ.. అంతా షాక్!

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>