కలం, తెలంగాణ బ్యూరో: ఉపాధి హామీ పనులకు మంగళవారం ఒక్కరోజే 2,54,812 మంది కూలీలు హాజరయ్యారు. వీబీ–జీ రామ్ జీ (VB-G RAM G Telangana) అమలు ప్రారంభమైన తర్వాత రాష్ట్రంలో నమోదైన అత్యధిక రోజువారీ కూలీల హాజరు ఇదేనని అధికారులు తెలిపారు. గత ఏడాదితో పోలిస్తే అక్టోబర్లో ఉపాధి హామీ పనులకు హాజరవుతున్న కూలీల సంఖ్య భారీగా పెరిగింది. గత ఐదేళ్ల అక్టోబర్ నెలలో నమోదైన రోజువారీ సగటు వేజ్ సీకర్ల సంఖ్యను పరిశీలిస్తే ఈ పెరుగుదల స్పష్టంగా కనిపిస్తోంది.
2025 అక్టోబర్లో రోజుకు సగటున 24,750 మంది మాత్రమే ఉపాధి హామీ పనులకు హాజరుకాగా.. 2026 అక్టోబర్లో ఈ సంఖ్య 2.16 లక్షలకు చేరింది. ఈ లెక్కన వేజ్ సీకర్ల సంఖ్య ఇప్పుడు గణనీయంగా పెరిగింది. ఎల్ నినో ప్రభావంతో గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ పనులు తగ్గుతున్న నేపథ్యంలో కూలీలకు ప్రత్యామ్నాయ ఉపాధి కల్పించేందుకు ప్రభుత్వం ఉపాధి హామీ పనులను విస్తృతంగా అందుబాటులోకి తీసుకొస్తోంది. ఈ మేరకు పనులను మరింత విస్తృతం చేయాలని మంత్రి సీతక్క గతంలోనే అధికారులను ఆదేశించారు. గ్రామాల్లో పని కోరుతున్న ప్రతి కుటుంబానికి వీలైనంత త్వరగా ఉపాధి కల్పించాలన్నారు. వేజ్ సీకర్ల సంఖ్యను మరింత పెంచేలా క్షేత్రస్థాయిలో చర్యలు తీసుకోవాలని సూచించారు.
కొత్తగా ఉపాధి హామీ కార్డులు కోరుతున్న వారికి 15 రోజుల్లోగా జాబ్ కార్డులు అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మంత్రి సీతక్క ఆదేశాలతో గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి హామీ పనుల పురోగతిని అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలిస్తున్నారు. కూలీలతో నేరుగా మాట్లాడి వారి అవసరాలను తెలుసుకోవడంతో పాటు పని కోరుతున్న వారికి వెంటనే ఉపాధి కల్పించేలా చర్యలు చేపడుతున్నారు. ఈ చర్యలతో ఉపాధి హామీ పనులకు హాజరవుతున్న కూలీల సంఖ్య క్రమంగా పెరుగుతూ ఇప్పుడు రికార్డు స్థాయికి చేరింది.

