కలం, వెబ్ డెస్క్: తెలంగాణలో ఎబోలా వ్యాధి నివారణకు అవసరమైన అన్ని ఏర్పాట్లు సిద్ధంగా ఉన్నాయని ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ (Damodar Raja Narasimha) స్పష్టం చేశారు. ప్రజలు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ఎబోలా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో రాష్ట్రంలో చేపట్టిన ముందస్తు జాగ్రత్తలు, పర్యవేక్షణ చర్యలు, వివిధ శాఖల మధ్య సమన్వయం, ఎమర్జన్సీ రెస్పాన్స్ సిస్టమ్, తదితర అంశాలపై సెక్రటేరియట్‌లో ఆయన సమీక్ష చేశారు. డెమోక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, ఉగాండా, దక్షిణ సూడాన్ దేశాల్లో ఎబోలా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో మంత్రి సమీక్ష చేపట్టారు. ఎబోలా ప్రభావిత దేశాల నుంచి రాష్ట్రానికి వచ్చే దేశ, విదేశీ ప్రయాణికులపై ప్రత్యేక నిఘా కొనసాగుతున్నట్లు అధికారులు మంత్రికి వివరించారు. శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో అమలులో ఉన్న స్క్రీనింగ్, సర్వైలెన్స్ వ్యవస్థలను మరింత బలోపేతం చేశామని మంత్రికి తెలిపారు.
అనుమానితులను ఐసోలేషన్‌లో ఉంచుతున్నాం..
ప్రభావిత దేశాల నుంచి వచ్చిన ప్రయాణికుల వివరాలను సేకరించి, వారి ఆరోగ్య పరిస్థితిని 21 రోజుల పాటు నిరంతరం పర్యవేక్షిస్తున్నామన్నారు. అనుమానిత లక్షణాలు కనిపించిన వారిని గాంధీ హాస్పిటల్‌లో ఐసోలేషన్‌లో ఉంచుతున్నామని తెలిపారు. ఇప్పటివరకూ ఇద్దరు అనుమానితులను గాంధీలో ఐసోలేషన్‌లో ఉంచి, వారి సాంపిల్స్‌ను టెస్టుల కోసం పూణేలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీకి పంపించగా.. అక్కడ చేసిన టెస్టుల్లో వారి ఇద్దరికీ వైరస్ నెగిటివ్ వచ్చిందని మంత్రికి వివరించారు. ఐసీఎంఆర్ సూచన మేరకు వారి సాంపిల్స్‌ను మరోసారి సేకరించి టెస్టుల కోసం పూణేలోని ఎన్‌ఐవీకి పంపించామని చెప్పారు. రెండోసారి నెగిటివ్ వస్తే, వారిని ఐసోలేషన్‌లో నుండి డిశ్చార్జ్ చేస్తామన్నారు.
వారి వివరాలు కచ్చితంగా ఉండాల్సిందే..
ఈ సందర్భంగా అధికారులకు మంత్రి కీలక సూచనలు చేశారు. అనుమానిత సాంపిల్స్ సేకరణ, టెస్టులు చేయడంలో ఎలాంటి అలసత్వం ఉండకూడదని చెప్పారు. ఆరోగ్యశాఖకు అవసరమైన సహకారం అందించాలని సీసీఎంబీ డైరెక్టర్ డాక్టర్ వినయ్ నందికూరిని మంత్రి కోరారు. ఐసీఎంఆర్ నుంచి ఎబోలా టెస్టింగ్ కిట్లు వచ్చాయని, టెస్టులు చేయడం ప్రారంభించామని వినయ్ తెలిపారు. సాంపిల్ వచ్చిన వెంటనే టెస్టులు చేసి, ఆరోగ్యశాఖ అధికారులకు సమాచారం ఇస్తామని ఆయన వివరించారు. విదేశాల నుంచి వచ్చే కొంత మంది ప్రయాణికులు తమకు ఇచ్చిన అడ్రస్‌లో ఉండడం లేదని అధికారులు మంత్రికి తెలిపారు. ఈ అంశంపై మంత్రి సీరియస్‌గా స్పందించారు. ప్రయాణికులు తమ చిరునామా, ఫోన్ నంబర్ తదితర వివరాలను కచ్చితంగా, సక్రమంగా అందించాల్సిందేనని మంత్రి స్పష్టం చేశారు. తప్పు సమాచారం ఇచ్చే వారిపై ఎపిడెమిక్ డిసీజెస్ యాక్ట్ సహా వర్తించే చట్టాల ప్రకారం కేసులు నమోదు చేయాలని అధికారులను ఆదేశించారు.

