కలం, వెబ్ డెస్క్: ప్రస్తుత కాలంలో ఎక్కడ చూసినా సోషల్ మీడియా (Social Media )హవాయే నడుస్తోంది. చిన్నా.. పెద్దా అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ సోషల్ మీడియా వినియోగదారులే. దీన్ని వాడుకొని కొందరు అంచెలంచెలుగా ఎదుగుతుంటే.. మరి కొందరు తమ అమాయకత్వంతో నిలువునా మోసపోతున్నారు. వాస్తవానికి సోషల్ మీడియాలో మంచి ఉంది, చెడు ఉంది. అయితే వినియోగదారులే ఈ రెండింటి మధ్య తేడాను గుర్తించి జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. ఇందులో ముఖ్యంగా వ్యక్తిగత సమాచారాన్ని ఎంత తక్కువగా షేర్ చేసుకుంటే అంత మంచిది. అయితే.. ఓ మహిళా యూట్యూబర్ అత్యుత్సాహంతో చేసిన ఓ వీడియో తన కొంప ముంచింది.
మధ్యప్రదేశ్ (Madhya Pradesh)కు చెందిన రచనా గుర్జర్ (Rachna Gurjar) యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్‌లలో వీడియోలు చేస్తుంటారు. తాజాగా ఆమె హోమ్ టూర్ వీడియో చేసింది. ఇందులో తన వద్ద ఉన్న నగల గురించి కూడా వీడియో తీసి యూట్యూబ్‌లో పోస్ట్ చేసింది. ఆ వీడియో కాస్తా వైరల్‌గా మారింది. ఇదే ఆమెకు కొత్త చిక్కులు తీసుకొచ్చింది. ఆ వీడియో చూసిన కొందరు దొంగలు ఆమె ఇంట్లోకి చొరబడి రూ.1.91 లక్షల నగదు, రూ.6 లక్షల విలువైన బంగారు ఆభరణాలను దోచుకెళ్లారు. వీటితో పాటు ఇంట్లోని ఫ్రిడ్జ్‌లో ఉన్న ఎనర్జరీ డ్రింక్స్ కూడా ఎత్తుకెళ్లారు. దీంతో రచనా గుర్జర్ పోలీసులను ఆశ్రయించింది. ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సోషల్ మీడియాలో వ్యక్తిగత సమాచారం, ఆర్థిక విషయాలు షేర్ చేసుకోవద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు.

