టికెట్ ఇప్పించి తప్పు చేశా: కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

కలం, భువనగిరి: కోమటిరెడ్డి బ్రదర్స్‌పై తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్ వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఈ నేపథ్యంలోనే మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి (Komatireddy Rajagopal Reddy) భువనగిరిల మందుల సామేల్ వ్యాఖ్యలపై  స్పందించారు. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో తాను కీలక పాత్ర పోషించానని, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి ఎంతో శ్రమించానని రాజగోపాల్ రెడ్డి గుర్తు చేసుకున్నారు.

వంద సార్లు నా ఇంటికి వచ్చి..

తుంగతుర్తి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ టికెట్‌ను ఒక తప్పుడు వ్యక్తికి కేటాయించారని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పేర్కొన్నారు. తనపై నిరాధారమైన, తప్పుడు ఆరోపణలు చేసిన వ్యక్తికి టికెట్ వచ్చేలా తాను కూడా కృషి చేసినట్లు వివరించారు.

టికెట్ ఇప్పించాలని తన ఇంటికి మందుల సామేల్ వందసార్లు వచ్చారని గుర్తు చేసుకున్నారు. తుంగతుర్తితో తనకు సంబంధం లేకపోతే టికెట్ ఇప్పించాలని నా ఇంటికి వచ్చి ఎందుకు అడిగారని ప్రశ్నించారు.

మాట ఇచ్చినందుకే..

తుంగతుర్తిలో కాంగ్రెస్ టికెట్ కోసం చాలా మంది పోటీపడ్డారని రాజగోపాల్ రెడ్డి వివరించారు. కానీ, మందుల సామేల్‌కు తనతో పాటు అసెంబ్లీకి తీసుకెళ్తానని మాటిచ్చినట్లు గుర్తు చేశారు. అందులో భాగంగానే బాన్సువాడలో ఏనుగు రవీందర్ రెడ్డి, తుంగతుర్తిలో మందుల సామేల్‌కు టికెట్ ఇప్పించానని స్పష్టం చేశారు. నేను పార్టీలో చేరేటప్పుడు అధిష్ఠానాన్ని కూడా ఇదే అడిగానని.. ప్రచారంలోనూ మందుల సామేల్‌కు అన్ని రకాలుగా సహకరించినట్లు ఆవేదన వ్యక్తం చేశారు.

తుంగతుర్తి ప్రజలకు క్షమాపణలు..

తుంగతుర్తి ప్రజలు, తనను నమ్మి ఓటు వేసిన పార్టీ కార్యకర్తలు, అభిమానులకు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బహిరంగంగా క్షమాపణలు చెప్పారు. ప్రస్తుత పరిణామాలను ఉద్దేశిస్తూ “వినాశకాలే విపరీత బుద్ధి” అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. మందుల సామేల్ వ్యాఖ్యలపై ఎవరూ మీడియా సమావేశాలు నిర్వహించవద్దని రాజగోపాల్ రెడ్డి కోరారు.

ఎలాంటి నిరసన కార్యక్రమాలు చేపట్టవద్దని.. కార్యకర్తలు ఓపికతో వ్యవహరించాలని సూచించారు. కాగా, తుంగతుర్తి ఎమ్మెల్యేను ఉద్దేశించి రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీ అంతర్గత విభేదాలను మరోసారి బయటపెట్టాయని చర్చ జరుగుతోంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>