Mobile Popup Ad
Mobile Popup Ad

నిరుద్యోగుల ఓట్లే లక్ష్యం.. సెంటిమెంట్‌గా మారిన ‘కోచింగ్ యాప్’!

​కలం, ఖమ్మం బ్యూరో: ఉమ్మడి ఖమ్మం, నల్గొండ, వరంగల్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ (Graduates MLC Election) నియోజకవర్గంలో రాజకీయ వాతావరణం అప్పుడే ముందస్తుగా వేడెక్కుతోంది. ప్రస్తుత ఎమ్మెల్సీ పదవీకాలం ముగియడానికి ఇంకా సమయం ఉన్నప్పటికీ, ప్రధాన పార్టీలు అభ్యర్థులను ఖరారు చేసే యోచనలో ఉండటంతో ఆశావహులు తమ ప్రయత్నాలను ముమ్మరం చేశారు. విద్యావంతులు, ఉద్యోగులు, నిరుద్యోగులే ఓటర్లుగా ఉన్న ఈ స్థానాన్ని దక్కించుకునేందుకు పార్టీలు ఇప్పటి నుంచే క్షేత్రస్థాయి వ్యూహాలకు పదును పెడుతున్నాయి. అయితే ఈసారి ఎన్నికల ప్రచారంలో డిజిటల్ వ్యూహాలు, ముఖ్యంగా నిరుద్యోగులను ఆకట్టుకునే “ఉచిత కోచింగ్ యాప్” ఒక బలమైన సెంటిమెంట్‌గా, ప్రధాన ఆయుధంగా మారిపోవడం విశేషం.

డిజిటల్ వ్యూహం రాకేష్ రెడ్డికి కలిసొస్తుందా?​

గత 2024 ఉప ఎన్నికల్లో తీన్మార్ మల్లన్న నిరుద్యోగుల కోసం ఉచిత కోచింగ్ యాప్‌ను అందుబాటులోకి తెచ్చి, యువత ఓట్లను పెద్ద ఎత్తున సాధించి ఘన విజయం సాధించారు. నాటి ఎన్నికల్లో రెండో స్థానంలో నిలిచిన బీఆర్ఎస్ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డి, ఈసారి అదే సక్సెస్ ఫార్ములాను, సెంటిమెంట్‌ను గట్టిగా నమ్ముకున్నారు. ఎలాగైనా విజయం సాధించాలనే పట్టుదలతో ఉన్న రాకేష్ రెడ్డి, పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న నిరుద్యోగుల కోసం ప్రత్యేకంగా ఒక యాప్‌ను రూపొందించి ఉచితంగా డిజిటల్ కోచింగ్ అందిస్తున్నారు. అందులో భాగంగా మే 28న ఖమ్మం పట్టణంలో ఈ యాప్‌ను ఆవిష్కరించిన ఆయన, తాజాగా సోమవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో కూడా దీనిని విడుదల చేసి క్షేత్రస్థాయిలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. లక్షల రూపాయల విలువ చేసే గ్రూప్స్, పోలీస్, టీచర్ వంటి ఉద్యోగాల ఆన్‌లైన్ కోచింగ్‌ను ఉచితంగా అందుబాటులోకి తేవడం, అదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వం వరుస నోటిఫికేషన్లు ఇస్తుండటంతో ఈ డిజిటల్ వ్యూహం రాకేష్ రెడ్డికి ఎన్నికల్లో బాగా కలిసివచ్చే అంశమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

కాంగ్రెస్ పార్టీ టికెట్ కోసం అంతర్గత పోటీ..

​మరోవైపు గత ఎన్నికల సమీకరణాలతో పోలిస్తే ఈసారి రాజకీయ చిత్రం పూర్తిగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. గతంలో కాంగ్రెస్ పార్టీ మద్దతుతో గెలిచిన తీన్మార్ మల్లన్న, ప్రస్తుత పరిస్థితుల్లో “తెలంగాణ రాజ్యాధికార పార్టీ” పేరిట సొంత పార్టీని స్థాపించడంతో, ఈసారి ఆయనకు కాంగ్రెస్ మద్దతు లభించే అవకాశం లేదు. అధికార కాంగ్రెస్ సైతం సొంత అభ్యర్థిని బరిలోకి దించేందుకు కసరత్తు చేస్తుండటంతో, ఈ నియోజకవర్గంలో ఈసారి బలమైన త్రిముఖ పోటీ తప్పేలా లేదు. అయితే అధికార కాంగ్రెస్ పార్టీ ఈసారి ఎవరిని రంగంలోకి దించుతుందనే దానిపై ఇంకా స్పష్టత రానప్పటికీ, టికెట్ కోసం పార్టీ అంతర్గతంగా తీవ్రమైన పోటీ నెలకొందనేది బహిరంగ రహస్యమే. ఈ నియోజకవర్గం పరిధిలోని ఉమ్మడి మూడు జిల్లాలకు చెందిన ఏడుగురు మంత్రులు తమ అనుచరులకు లేదా తమ వర్గం వారికే టికెట్ దక్కించుకోవాలని గట్టి పట్టుదలతో తెరవెనుక లాబీయింగ్ నడుపుతుండటం అధిష్టానానికి పెద్ద తలనొప్పిగా మారే ప్రమాదం కనిపిస్తోంది.​

ఏ పార్టీ గెలుస్తుందో..?

ఈ నియోజకవర్గ చరిత్రను పరిశీలిస్తే, 2021 ఎన్నికల్లో రికార్డు స్థాయిలో 72 మంది అభ్యర్థులు బరిలో నిలవగా, అప్పట్లో 5 లక్షల మందికి పైగా ఓటర్లు నమోదయ్యారు. ఆ ఎన్నికల్లో సుదీర్ఘ కౌంటింగ్ అనంతరం బీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి రెండో ప్రాధాన్యత ఓటు ద్వారా విజయం సాధించారు. ఆ తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన ఎమ్మెల్యేగా ఎన్నికవడంతో వచ్చిన 2024 ఉప ఎన్నికల్లో 52 మంది అభ్యర్థులు పోటీ చేయగా, 4.50 లక్షల మంది ఓటర్లకు గానూ 3.36 లక్షల మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ గణాంకాలను బట్టి చూస్తే పట్టభద్రుల ఎన్నికల్లో మొదటి ప్రాధాన్యత ఓట్లతో పాటు రెండో ప్రాధాన్యత ఓట్లు కూడా గెలుపోటములను శాసిస్తాయని స్పష్టమవుతోంది. ఈ నేపథ్యంలో, అటు ప్రభుత్వ నోటిఫికేషన్లపై నిరుద్యోగుల స్పందన, ఇటు అభ్యర్థులు అందిస్తున్న ఉచిత విద్యా కార్యక్రమాలు, కోచింగ్ యాప్‌ల ప్రయోగాలు రాబోయే ఎన్నికల్లో ఏ పార్టీకి అనుకూలంగా మారి పీఠాన్ని అందిస్తాయో వేచి చూడాలి.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>