రేపే టీఆర్ఎస్ పాంచజన్యం సంకల్ప సభ

కలం, నిజామాబాద్ బ్యూరో: తెలంగాణ రక్షణ సేన (Telangana Rakshana Sena) ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న పాంచజన్యం సభకు ఇందూరు సిద్ధమైంది. కల్వకుంట్ల కవిత పార్టీ ఆవిర్భావ సభ తరువాత తొలి పాంచజన్య సంకల్ప సభ ఇదే కావడం ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. తన మెట్టినిల్లు నిజామాబాద్ నుంచే కవిత పార్టీ శంఖారావం పూరించబోతున్నారు. పార్టీ ఆవిర్భావం రోజే పాంచజన్య పథకాలు, పార్టీ సిద్ధాంతాలు ప్రకటించారు. పాంచజన్యంపై సంకల్పం ఇందూరు నుంచే తీసుకుంటున్నారు.

ఏర్పాట్లు పర్యవేక్షించిన కవిత భర్త..

నిజామాబాద్ పాత కలెక్టరేట్ మైదానంలో పాంచజన్య సంకల్ప సభ నిర్వహిస్తున్నారు. ఇందుకోసం భారీగా ఏర్పాట్లు చేస్తుండగా.. కవిత భర్త అనిల్, మామ రామ్ కిషన్ రావ్ పనులను స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. ఆదివారం అనిత్ మైదానానికి వచ్చి అవంతి రావ్, లక్ష్మీనారాయణ, శరత్, మహేష్‌కు పలు సలహాలు సూచనలు చేశారు. ఆదివారం రాత్రి సైతం నిరాటంకంగా పనులు చేసి, సోమవారం ఉదయానికి సభా ప్రాంగణం సిద్ధం చేయబోతున్నారు.

20 వేల మంది వస్తారని అంచనా..

టీఆర్ఎస్ సభ నేపథ్యంలో నిజామాబాద్ జిల్లా కేంద్రంలో పలు చోట్ల పార్టీ జెండాలు రెపరెపలాడుతున్నాయి. నెహ్రూ చౌక్, కోర్టు చౌరస్తా, కంఠేశ్వర్, బోర్గాం లాంటి ప్రాంతాల్లో కవిత ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. నిజామాబాద్ జిల్లాలోని అయిదు నియోజక వర్గాల నుంచి దాదాపు 20 వేల మంది సభకు హాజరయ్యేలా ఏర్పాట్లు చేస్తున్నారు. నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలోని జగిత్యాల, కోరుట్లతో పాటు కామారెడ్డి జిల్లాల నుంచి కూడా జనసమీకరణ చేస్తున్నారు.

కవిత షెడ్యూల్ ఇలా..

రేపు నిర్వహించబోయే పాంచజన్యం సభకు కవిత హాజరు కాబోతున్న నేపథ్యంలో షెడ్యూల్‌ను పార్టీ వర్గాలు విడుదల చేశాయి. సోమవారం హైదరాబాద్ నుంచి బయల్దేరి మధ్యాహ్నం 2.30 గంటలకు ఇందల్వాయి మండలం గన్నారం గ్రామానికి చేరుకుని అక్కడ తెలంగాణ రక్షణ సేన జెండా ఎగురవేస్తారు. మధ్యాహ్నం 2.45 గంటలకు మాధవ నగర్ సాయిబాబా గుడి నుంచి ర్యాలీగా నిజామాబాద్ పట్టణానికి బయల్దేరుతారు.

ర్యాలీగా కవిత పులాంగ్ చౌరస్తా, రాజ రాజేంద్ర చౌరస్తా, పెద్ద బజార్, నెహ్రూ పార్క్, గాంధీ చౌక్, బస్టాండ్ మీదుగా ఓల్డ్ కలెక్టరేట్ మైదానానికి చేరుకుంటారు. మధ్యాహ్నం 3.30 గంటల నుంచి 3.45 గంటల మధ్య వేదిక వద్దకు చేరుకుంటారు. సభ అనంతరం సాయంత్రం 6.30 గంటలకు నందిపేట మండలం సీహెచ్ కొండూరులోని శ్రీ రాజ్యలక్ష్మీ సమేత శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేస్తారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>