కలం, వెబ్ డెస్క్ : తెలంగాణలో ప్రభుత్వం ఏర్పడి వెయ్యి రోజులు అవుతున్న సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Minister Uttam) ఓ లేఖ విడుదల చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం వెయ్యి రోజులు పూర్తి చేసుకోవడం రాష్ట్ర ప్రస్థానంలో ఒక ముఖ్యమైన మైలురాయి అని మంత్రి చెప్పారు. తెలంగాణలో ప్రజాస్వామ్యం, సంక్షేమానికి వెయ్యి రోజులు అని చెప్పుకొచ్చారు. ఈ వెయ్యి రోజుల్లో కేవలం ప్రభుత్వం మాత్రమే మారలేదని, తెలంగాణ ప్రజలు పోరాడి సాధించుకున్న ప్రజాస్వామ్య స్ఫూర్తి పునరుద్ధరించబడిందని పేర్కొన్నారు.
బీఆర్ఎస్ నిరంకుశ పాలనకు ముగింపు
గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో అధికారం ఒక వ్యక్తి, ఒక కుటుంబం చేతుల్లో కేంద్రీకృతమైందని మంత్రి తెలిపారు. వారు ప్రజాస్వామ్య వ్యవస్థలను బలహీనపరిచి, ప్రశ్నించే వారిని శత్రువులుగా చూశారని మండిపడ్డారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఆ నిరంకుశ సంస్కృతికి ముగింపు పలికిందని.. నేడు ప్రజలు నిర్భయంగా తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారని పేర్కొన్నారు. ప్రజావాణి, గ్రామసభలు, ప్రత్యక్ష ప్రజా సంప్రదింపుల ద్వారా పాలనను ప్రజల ముంగిటకు తీసుకొచ్చామన్నారు.
విప్లవాత్మక సంక్షేమ పథకాలు అమలు
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజాస్వామ్య పునరుద్ధరణతోపాటు విప్లవాత్మక సంక్షేమ పథకాలను తీసుకొచ్చామని మంత్రి వెల్లడించారు.మహిళలకు ఉచిత ఆర్టీసీ ప్రయాణం , గృహజ్యోతి ద్వారా అర్హులైన కుటుంబాలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ , రూ.500కే వంటగ్యాస్ సిలిండర్ అందిస్తున్నామని పేర్కొన్నారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ పరిమితిని రూ.10 లక్షలకు పెంచి పేదలకు మెరుగైన వైద్యం అందుబాటులోకి తెచ్చామన్నారు.
దేశానికే ఆదర్శంగా నిలిచే సంస్కరణలు
పౌర సరఫరాల రంగంలో దేశానికే ఆదర్శంగా నిలిచే సంస్కరణలు చేపట్టామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. లక్షలాది అర్హులైన కుటుంబాలకు కొత్త రేషన్ కార్డులు మంజూరు చేసి, ఆధునిక స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీని ప్రారంభించామని తెలిపారు. ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద రూ.5 లక్షల సహాయంతో పేద కుటుంబాల సొంతింటి కలను సాకారం చేస్తున్నామన్నారు. రైతులకు రూ. 2 లక్షల వరకు పంట రుణాలను మాఫీ చేయడంతో పాటు రైతు భరోసాను ఎకరానికి రూ. 12వేలకు పెంచినట్లు తెలిపారు.
సంక్షేమంతోపాటు అభివృద్ధి
సంక్షేమంతోపాటు అభివృద్ధిని సమానంగా ముందుకు తీసుకెళ్లామని మంత్రి చెప్పారు. దాదాపు 70 వేల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేశామని.. సమగ్ర కులగణన, ఎస్సీ వర్గీకరణ విషయంలో సాధించిన పురోగతి సామాజిక న్యాయం పట్ల తమ నిబద్ధతకు నిదర్శమని వెల్లడించారు. ఈ వెయ్యి రోజుల ప్రజా ప్రభుత్వ విజయాలను బీఆర్ఎస్ చెరిపివేయలేదని.. మరింత సంకల్పంతో ఈ ప్రజా ప్రస్థానం కొనసాగుతుందని స్పష్టం చేశారు.

