కలం, వెబ్ డెస్క్ : తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి రోజుల పాలన పూర్తి చేసుకుంటున్న సందర్భంలో ‘చాణక్య స్ట్రాటజీస్’ నిర్వహించిన రాష్ట్రవ్యాప్త రాజకీయ సర్వే (Chanakya Strategies Survey) పలు ఆసక్తికర విషయాలను వెల్లడించింది. రెండు నెలల పాటు క్షేత్రస్థాయిలో ప్రజల అభిప్రాయాలను సేకరించిన ఈ సంస్థ ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, వివిధ పార్టీల గ్రాఫ్, ప్రజాభిప్రాయాన్ని విశ్లేషించింది.
ఈ నివేదిక ప్రకారం కాంగ్రెస్ పార్టీతో పోలిస్తే ప్రతిపక్ష బీఆర్ఎస్ (BRS) తన గ్రాఫ్‌ను కొంతవరకు మెరుగుపరుచుకున్నట్లు స్పష్టమవుతోంది. అదే సమయంలో బీజేపీ తన ఓటు బ్యాంకును కాపాడుకుంటున్నప్పటికీ గ్రాఫ్ తగ్గుముఖం పడుతోందని, ముఖ్యంగా జీహెచ్ఎంసీ పరిధిలో దాని ప్రభావం క్షీణించిందని సర్వే స్పష్టం చేసింది.
ఈ సర్వే(Chanakya Strategies Survey)లో కీలకమైన అంశం ఓటర్ల వైఖరి. యాభై ఏళ్లు దాటిన ఓటర్లలో అధిక శాతం మంది బీఆర్ఎస్ వైపు మొగ్గు చూపుతుండగా, యువతరం ‘జెన్ జీ’ ఓటర్లు మాత్రం మార్పును కోరుకుంటూ ఒక బలమైన ప్రత్యామ్నాయం కోసం ఎదురుచూస్తున్నట్లు వెల్లడైంది.
కాంగ్రెస్ ప్రభుత్వంపై వెలువడుతున్న వ్యతిరేకతను తమకు అనుకూలంగా మలుచుకోవడంలో బీఆర్ఎస్ పూర్తిస్థాయిలో సక్సెస్ కాలేకపోయిందని ప్రజాభిప్రాయం వ్యక్తమైంది. మరోవైపు ఆర్థిక స్థితిగతుల పరంగా చూస్తే గ్రామీణ ప్రాంతాల్లోని పేద వర్గాలు కాంగ్రెస్ వైపు నిలబడగా, ఎగువ మధ్యతరగతి, ధనిక వర్గాల్లో ప్రభుత్వం పట్ల కొంత అసంతృప్తి వాతావరణం కనిపిస్తోందని సర్వే తెలిపింది.
ప్రభుత్వ పనితీరును పరిశీలిస్తే ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం, ఉచిత విద్యుత్, ఇందిరమ్మ ఇళ్లు, రైతు రుణమాఫీ వంటి సంక్షేమ పథకాలు కాంగ్రెస్‌కు సానుకూల అంశాలుగా మారాయి. అయితే ఇచ్చిన ప్రధాన హామీల అమలులో ఆలస్యం, నిరుద్యోగ భృతిపై స్పష్టత లేకపోవడం, హైడ్రా చర్యలతో రియల్ ఎస్టేట్ రంగంలో ఏర్పడిన భయాందోళనలు, భూముల క్రమబద్ధీకరణలోని సమస్యలు ప్రభుత్వానికి ప్రతికూలంగా పరిణమించాయని చాణక్య స్ట్రాటజీస్ సర్వే పేర్కొన్నది.
Also Read : కాంగ్రెస్ 420 హామీలు ఏమయ్యాయి? దాస్యం వినయ్ భాస్కర్ ఫైర్!
Follow Us On : WhatsApp

