కలం, మహబూబ్ నగర్ బ్యూరో: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాస్వామ్య విలువలను పక్కనబెట్టి, ప్రతిపక్షాన్ని అణచివేయడమే లక్ష్యంగా వ్యవహరిస్తోందని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు భండారి శాంతికుమార్ (Bhandari Shanthi Kumar) తీవ్రంగా మండిపడ్డారు. ఈ మేరకు మంగళవారం ఒక పత్రిక ప్రకటనను విడుదల చేశారు. నల్గొండ జిల్లా బీజేపీ అధ్యక్షుడు డా. వర్షిత్ రెడ్డి నివాసంపై దాడి చేసి, కుటుంబ సభ్యులపై దౌర్జన్యానికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాల్సిన ప్రభుత్వం, బాధిత కుటుంబానికి అండగా నిలిచేందుకు వెళుతున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్. రామచందర్ రావుని ముందుగా గృహ నిర్బంధం చేసి, అనంతరం అరెస్ట్ చేసి గాంధీనగర్ పోలీస్ స్టేషన్కు తరలించడం దారుణమని అన్నారు.
“దాడిచేసిన వారిని స్వేచ్ఛగా తిరగనిస్తారు… బాధితుల పక్షాన నిలిచిన నాయకుడిని అరెస్ట్ చేస్తారు. ఇదేనా కాంగ్రెస్ ప్రజాపాలన? ఇదేనా మీ ప్రజాస్వామ్యం?” అని శాంతికుమార్ నిలదీశారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి నిజంగా చట్టంపై గౌరవం ఉంటే, మొదట దాడికి పాల్పడిన వారిని అరెస్ట్ చేయాలని, కానీ వారిపై చర్యలు తీసుకోకుండా ప్రతిపక్ష నేతలపై పోలీసు వ్యవస్థను ప్రయోగించడం అధికార దుర్వినియోగానికి పరాకాష్ట అని విమర్శించారు. అరెస్టులు, గృహ నిర్బంధాలు, బెదిరింపులతో బీజేపీ గొంతును నొక్కేయాలని చూస్తే అది కాంగ్రెస్ భ్రమ మాత్రమేనని వ్యాఖ్యానించారు. అధికార మదంతో ప్రతిపక్షాన్ని అణచివేయాలనుకుంటే తెలంగాణ ప్రజలే తగిన సమాధానం చెబుతారని హెచ్చరించారు.
బీజేపీ నాయకులు, కార్యకర్తలపై జరుగుతున్న నిర్బంధాలను వెంటనే నిలిపివేసి, నల్గొండ ఘటనలో దాడికి బాధ్యులైన వారందరిపై తక్షణమే కఠిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దాడిచేసిన వారిని కాపాడుతూ, ప్రశ్నించే వారిని అరెస్ట్ చేసే కాంగ్రెస్ ప్రభుత్వానికి బీజేపీ తలవంచదని అని తెలిపారు. ప్రజల హక్కులు, న్యాయం, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం తమ పోరాటాన్ని మరింత ఉధృతంగా కొనసాగిస్తామని భండారి శాంతికుమార్ స్పష్టం చేశారు.

