‘సర్’ షెడ్యూల్‌.. తెలంగాణ రాజకీయ పార్టీలు అల‌ర్ట్‌!

కలం, తెలంగాణ బ్యూరో: కేంద్ర ఎన్నికల సంఘం జారీచేసిన ‘సర్’ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) నోటిఫికేషన్, షెడ్యూలుతో తెలంగాణ (Telangana)లోని అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు (Political Parties) అప్రమత్తమయ్యాయి. ఈ ప్రక్రియ చేపట్టిన పలు రాష్ట్రాల్లో లక్షల సంఖ్యలో ఓటర్ల పేర్లు గల్లంతయ్యాయి. అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీల తలరాతలు మారాయి. చివరకు ఈ వివాదం సుప్రీంకోర్టుకు చేరింది. దాదాపు పాతిక సంవత్సరాల తర్వాత ఎలక్షన్ కమిషన్ చేపట్టిన ‘సర్’ (SIR)తో బీహార్ మొదలు బెంగాల్ వరకు వివాదాలు తలెత్తాయి. ఆయా రాష్ట్రాల్లోని పార్టీల పునాదులే కదిలిపోయాయి. ప్రతీ సంవత్సరం జరిగే రెగ్యులర్ ‘ఓటర్ల జాబితా సవరణ’ (స్పెషల్ సమ్మరీ రివిజన్)తో పోలిస్తే ‘సర్’ చాలా ప్రత్యేకమైనదని, అప్రమత్తంగా ఉండకపోతే అర్హులైన ఓటర్ల పేర్లు జాబితా నుంచి డిలీట్ అవుతాయని పార్టీలు వాటి బూత్ స్థాయి ఏజెంట్లను అలర్ట్ చేశాయి.

రెండున్నరేండ్ల ముందే పార్టీల్లో అలజడి :

అసెంబ్లీ ఎన్నికల సమయంలో పార్టీల్లో కనిపించే హడావిడి ఇప్పుడు ‘సర్’ ప్రక్రియ సందర్భంగానే మొదలైంది. అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు ఓటర్ల జాబితానే అసలు యుద్ధరంగం అని భావిస్తున్నాయి. గతంలో ఇతర రాష్ట్రాల్లో జరిగిన ‘సర్’ అనుభవాలతో తెలంగాణలో ఏం జరగబోతున్నదో అనే అలజడి మొదలైంది. ఓటర్ల జాబితాలో లక్షల పేర్లు తొలగించడం, కొత్త పేర్లు చేర్చడం, వాటిపై వచ్చిన వివాదాలు చివరకు ఎన్నికల ఫలితాల దిశనే మార్చాయన్నది ఇక్కడి రాజకీయ పార్టీల అభిప్రాయం. బీహార్, పశ్చిమబెంగాల్, తమిళనాడు, కేరళ.. ఇలాంటి రాష్ట్రాల్లోని తాజా ఫలితాలను ‘సర్’ ప్రక్రియతో పోల్చి చూసుకుంటున్నాయి. అందుకే తెలంగాణలో బూత్ స్థాయి కార్యకర్తల నుంచి రాష్ట్ర స్థాయి నేతల వరకూ అన్ని పార్టీలు మీటింగులు పెట్టుకుంటున్నాయి. బోగస్ ఓట్ల ఏరివేత పేరుతో అర్హులైనవారి పేర్లను కూడా తొలగించే ప్రమాదమున్నదని, దీన్ని నివారించేలా బూత్ ఏజెంట్లు చాలా అలర్టుగా ఉండాలని సూచించాయి.

బూత్ లెవెల్ ఏజెంట్ల నిఘా కీలకం :

ఓటర్ల జాబితాను సవరించే ప్రక్రియపై పార్టీలకు భిన్నాభిప్రాయం లేకపోయినప్పటికీ ఈసారి జరుగుతున్న ‘సర్’ మాత్రం చాలా భిన్నమైనదని, కొన్ని పార్టీలకు ఉద్దేశపూర్వకంగానే మేలు చేసేలా జరిగే అవకాశమున్నదని అనుమానిస్తున్నాయి. అందుకే ఇంటింటికీ తిరిగి వివరాలను సేకరించి తుది జాబితాను రూపొందించే బూత్ లెవల్ ఆఫీసర్లతో పాటు కలిసి తిరగాలని, ప్రతీ మార్పును నిశితంగా గమనించి లోపాల్లేకుండా చూడాలని ఏజెంట్లను ఆ పార్టీలు హెచ్చరించాయి. ‘సర్’ జరిగే ప్రక్రియపై ఏజెంట్లకు అవగాహనా తరగతులు, శిక్షణ ఇవ్వాలని భావించాయి. ఎవరి పేర్లు డిలీట్ అవుతున్నాయి.. ఎవరి పేర్లు చేరుతున్నాయి.. ఒక చోటి నుంచి మరో చోటికి మారే ఓటర్లు ఎవరు.. ఇవన్నీ సక్రమంగానే జరుగుతున్నాయా.. బీఎల్వోలను పరోక్షంగా ఎవరైనా డ్రైవ్ చేస్తున్నారా.. ఇలాంటి అంశాల్లో అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించాయి.

పార్టీల తలరాతలే మార్చే ‘సర్’ సవరణ :

ఇప్పటివరకు జరిగిన ‘సర్’తో కొన్ని రాష్ట్రాల్లో పార్టీ పునాదులే కూలిపోయాయి.. తలరాతలు మారాయి.. అధికారం చేజారిపోయింది.. అని తెలంగాణ పార్టీలు బలంగా విశ్వసిస్తున్నాయి. ఇందుకు కారణాలూ లేకపోలేదు. ఇప్పటివరకు అసెంబ్లీ ఎన్నికలు జరిగిన రాష్ట్రాల్లోని ఫలితాలను ఇందుకు ఉదాహరణలుగా చూస్తున్నాయి. ఆ రాష్ట్రాల్లోని కొన్ని నియోజకవర్గాల్లో ‘సర్’ పేరుతో తొలగించిన ఓట్ల సంఖ్య, ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థులు పొందిన మార్జిన్ కంటే ఎక్కువగా ఉన్నట్లు గమనించారు. ఆ ఓట్లే డిలీట్ కాకపోయి ఉంటే గెలిచి ఉండేవారమన్నది ఇప్పుడు ఓడిన పార్టీల అభిప్రాయం. పశ్చిమ బెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్ ఇదే వాదన చేస్తున్నది. ఆ రాష్ట్రంలోని 31 నియోజకవర్గాల్లో డిలీట్ అయిన ఓట్లు, గెలిచిన బీజేపీ అభ్యర్థికి వచ్చిన మార్జిన్ (మెజారిటీ) గణాంకాలను ప్రస్తావించింది. సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పటిషన్‌లో దీన్నే ప్రస్తావించింది. అధికారం కోల్పోడానికి ‘సర్’ కారణమనే నిర్ధారణకు వచ్చింది.

వలస ఓటర్లపైనే పార్టీల ప్రధాన ఫోకస్ :

‘సర్’ ప్రక్రియ ప్రభావం ఎక్కువగా వలస కూలీలు, నగర ప్రాంతాల ఓటర్లు, మైనారిటీ ఓటర్లపైనే ఎక్కువగా ఉంటుందన్నది ప్రధాన పార్టీల భావన. అందుకే కేటీఆర్ తాజాగా సనత్‌నగర్ నియోజకవర్గంలో బూత్ స్థాయి పార్టీ కార్యకర్తలతో జరిగిన సమావేశంలో వలస ఓటర్ల అంశాన్ని బలంగా ప్రస్తావించారు. బూత్ స్థాయి నిఘా బలహీనంగా ఉంటే నష్టం కలగొచ్చని అలర్ట్ చేశారు. ఇతర ప్రాంతాల నుంచి చదువు కోసమో, ఉద్యోగం కోసమో, ఉపాధి కోసమో వలస వచ్చి ఇక్కడ ఉంటున్నట్లయితే ఎక్కడో ఒక చోట మాత్రమే ఓటు హక్కు ఉండేలా చూడాలని, రెండు చోట్లా డిలీట్ అయ్యేలా కాకుండా నిఘా ఉంచాలన్నారు. బీజేపీ సైతం హైదరాబాద్ ఓల్డ్ సిటీపై దృష్టి పెట్టి ముస్లిం పేర్లతో ఉండే బోగస్ ఓటర్లను, అర్హత లేని రోహింగ్యాలను జాబితా నుంచి తొలగించేలా, కొత్త లిస్టులోకి ఎక్కకుండా చూడాలని బూత్ ఏజెంట్లకు ఇప్పటికే క్లారిటీ ఇచ్చింది.

అన్ని ఎన్నిలకూ ఇక నుంచి ఒకే జాబితా :

‘సర్’ ముగిసిన తర్వాత రూపొందే ‘ఓటర్ల తుది జాబితా’ ఇక నుంచి లోకల్ బాడీల నుంచి మొదలు పార్లమెంటు దాకా అన్ని ఎన్నికలకూ బేస్ కానున్నది. అందుకే ఇప్పుడు పార్టీలు ఎలక్షన్ క్యాంపెయిన్ కంటే ముందే “ఓటును కాపాడుకోవడం” అనే అంశంపై దృష్టి పెట్టాయి. ‘సర్’ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) ప్రక్రియతో ఓటర్ల జాబితా పకడ్బందీగా తయారవుతుంది. ప్రతీ ఇంటికి తిరిగి వివరాలను సేకరించే బీఎల్వోలు 2002 నాటి ఓటర్ల జాబితా, 2025 నాటి జాబితాను సరిపోల్చుకుని ఓటర్లు ఉన్నారో లేదో నిర్ధారించుకుంటారు. ఆ జాబితాల్లో పేర్లు ఉండి మరణించినవారు, చిరునామా మారినవారు, వేర్వేరు చోట్ల జాబితాలో పేర్లు ఉన్న డబుల్ ఎంట్రీ ఓటర్లు, అర్హత లేని ఓటర్లు.. ఇలాంటివన్నీ జాబితా నుంచి డిలీట్ చేయడం ప్రధాన ప్రక్రియ. ఇందుకోసం ఎలక్షన్ కమిషన్ సూచించిన పన్నెండు రకాల గుర్తింపు కార్డులను పరిగణనలోకి తీసుకుంటారు. ఆ వివరాలు ప్రస్తుతం ఉన్న నివాసంతో వెరిఫై అయితే జాబితాలో పేర్లు కొనసాగుతాయి.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>