పెంచిన పెట్రోల్ ధరలను వెంటనే తగ్గించాలి: సలిగంటి శ్రీనివాస్

కలం, ఖమ్మం బ్యూరో: నిత్యావసర వస్తువుల ధరల నియంత్రణలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమవడంతో పాటు ప్రజల సంక్షేమాన్ని విస్మరించిందని సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు సలిగంటి శ్రీనివాస్, కొత్తగూడెం (Kothagudem) పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య విమర్శించారు. దేశంలో పెంచిన పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ శనివారం కొత్తగూడెం పట్టణంలోని బస్టాండ్ సెంటర్ అమరవీరుల స్థూపం వద్ద సిపిఐ – ఏఐటీయూసీ ఆధ్వర్యంలో భారీ ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కేంద్రం అవలంబిస్తున్న ప్రజావ్యతిరేక విధానాల వల్ల సామాన్యుడిపై మోయలేని భారం పడుతోందని, ఆకాశాన్నంటుతున్న నిత్యావసర వస్తువుల ధరలను తక్షణమే అదుపు చేయాలని కోరారు.

అంతర్జాతీయంగా చమురు ధరలు తగ్గుతున్నా దేశంలో మాత్రం చమురు సంస్థల కార్పొరేట్ దోపిడీ సాగుతోందని, దీనిని అరికట్టడానికి ఇంధన ఉత్పత్తులను వెంటనే జీఎస్టీ పరిధిలోకి తేవాలని డిమాండ్ చేశారు. వంటగ్యాస్ ధరలను తగ్గించి, గతంలో ఉన్న సబ్సిడీని పునరుద్ధరించాలన్నారు. అలాగే పేదలను ఆదుకునేందుకు రేషన్ దుకాణాల ద్వారా అన్ని రకాల నిత్యావసరాలను సరఫరా చేయాలని, లేనిపక్షంలో పెంచిన ధరలకు వ్యతిరేకంగా ప్రజాపోరాటాలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కందుల భాస్కర్, ఎస్ కె ఫహీమ్, జిల్లా సమితి సభ్యులు నేరెళ్ల రమేష్, పార్టీ, ప్రజాసంఘాల నాయకులు, ప్రజా ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>