కలం, ఖమ్మం బ్యూరో: భద్రాద్రి కొత్తగూడెం (Bhadradri Kothagudem) జిల్లా మణుగూరు (Manuguru) సింగరేణి పరిధిలోని పీకే ఓసీ-2 ఓపెన్ కాస్ట్ గనిలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. నిత్యం బొగ్గు రవాణా, మట్టి తవ్వకాలతో బిజీగా ఉండే గనిలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. కోట్ల విలువైన భారీ ‘బ్రహ్మపుత్ర షావల్’ యంత్రం మంటల్లో చిక్కుకుని పూర్తిగా కాలి బూడిదైంది. గనిలో యంత్రం యథావిధిగా పనులు నిర్వహిస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. షావల్ క్యాబిన్ నుంచి ఒక్కసారిగా దట్టమైన పొగలు, మంటలు చెలరేగడాన్ని ఆపరేటర్ గమనించారు.
ప్రమాదాన్ని పసిగట్టిన ఆయన ఏమాత్రం ఆలస్యం చేయకుండా, ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని కిందికి దూకేశారు. ఆపరేటర్ సమయస్ఫూర్తితో వ్యవహరించడంతో ప్రాణనష్టం తృటిలో తప్పింది. మంటలు క్షణాల్లోనే యంత్రం మొత్తానికి వ్యాపించడంతో షావల్ పూర్తిగా దహనమైంది. ఈ ప్రమాదం కారణంగా సింగరేణి యాజమాన్యానికి సుమారు రూ. 3 కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు సమాచారం. ప్రమాద సంకేతాలు అందగానే అప్రమత్తమైన రక్షణ సిబ్బంది, ఫైర్ ఇంజన్లతో ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు.
హైడ్రాలిక్ పైపులో ఒక్కసారిగా డీజిల్ లీక్ కావడం, అది వేడి భాగాలకు తగలడం వల్లే మంటలు అంత వేగంగా వ్యాపించాయని అధికారులు భావిస్తున్నారు. ఈ ఘటనపై సింగరేణి యాజమాన్యం తీవ్రంగా స్పందించింది. అసలు ప్రమాదానికి దారితీసిన సాంకేతిక కారణాలు ఏంటి? నిర్వహణ లోపాలు ఏమైనా ఉన్నాయా? అనే కోణంలో సమగ్ర విచారణకు ఆదేశించింది. దీనిపై పూర్తి స్థాయి దర్యాప్తు జరుపుతున్నట్లు అధికారులు తెలిపారు.

