కలం, వెబ్ డెస్క్ : ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) కు తెలంగాణ పోలీసులు షాక్ ఇచ్చారు. గచ్చిబౌలిలో జనసేన చేపట్టబోయే తెలంగాణ నవ నిర్మాణ సంకల్ప సభకు పర్మిషన్ నిరాకరించారు. ఈ మేరకు జనసేన నాయకులకు నోటీసులు జారీ చేశారు. . పోలీసుల నిర్ణయాన్ని సవాలు చేస్తూ తెలంగాణ జనసేన పార్టీ నేతలు హైకోర్టును ఆశ్రయించారు. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల రాజకీయ నాయకుల మధ్య మాటల యుద్ధం నడుస్తున్న వేళ పోలీసులు ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. అయితే, తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల నేపథ్యంలో శాంతిభద్రతల సమస్యలు తలెత్తే అవకాశం ఉన్నందున్న పర్మిషన్ ఇవ్వడం లేదని పోలీసులు చెబుతున్నారు. అలాగే సభకు సుమారు 2 వేల మందికి పైగా హాజరయ్యే అవకాశం ఉండటంతో ట్రాఫిక్ సమస్యలు ఏర్పడే ప్రమాదం ఉందని చెబుతున్నారు.
అదనంగా, సభ నిర్వాహకులు ప్రతిపాదించిన పార్కింగ్ స్థలం సరిపోకపోవడంతో పాటు, పార్కింగ్ కోసం సూచించిన ఎఫ్‌సీఐ సొసైటీ లేఔట్ భూమికి సంబంధించి కోర్టులో క్రిమినల్ కేసులు పెండింగ్‌లో ఉన్నాయని పోలీసులు జారీ నోటీసులో పేర్కొన్నారు. దీంతో సభ నిర్వహణకు అనుమతి ఇవ్వాలని కోరుతూ తెలంగాణ జనసేన నాయకులు తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసినట్లు సమాచారం. ఈ వ్యవహారంపై హైకోర్టు విచారణ అనంతరం తుది నిర్ణయం వెలువడనుంది. సభ అనుమతి నిరాకరణపై తెలుగు రాష్ట్రాల రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

