కలం, ఖమ్మం బ్యూరో: ఖమ్మం జిల్లా ఏన్కూర్ (Enkuru) మండల పరిధిలోని టిఎల్ పేట శివార్లలో పెద్ద ఎత్తున ఎక్స్‌పైరీ డేట్ ముగిసిన కూల్‌డ్రింక్స్ బాటిళ్లు, మినరల్ వాటర్ బాటిళ్లు పడివుండటం స్థానికంగా తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. కొన్ని ప్రముఖ కంపెనీలకు చెందిన వందల సంఖ్యలో ప్లాస్టిక్ బాటిళ్లను ఒకేచోట పారవేయడం వెనుక ఎవరున్నారు అనే ప్రశ్న ఇప్పుడు స్థానిక ప్రజల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. నిబంధనల ప్రకారం గడువు ముగిసిన ఆహార, పానీయాల ఉత్పత్తులను శాస్త్రీయ పద్ధతిలో ధ్వంసం చేయాల్సి ఉంటుంది. కానీ అలా చేయకుండా, అర్ధరాత్రి వేళల్లోనో లేదా రహస్యంగానో తెచ్చి ఇలా గ్రామ శివారులో పడవేయడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఈ ఎక్స్‌పైరీ కూల్‌డ్రింక్స్‌ను ఎవరికైనా అక్రమంగా విక్రయించే ప్రయత్నం చేసి, కుదరక ఇక్కడ పడేశారా, లేక హోల్‌సేల్ వ్యాపారులు, డీలర్లు తమ గోదాముల్లో మిగిలిపోయిన స్టాక్‌ను వదిలించుకోవడానికి ఈ పనిచేశారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
రోడ్ల పక్కన, కాలువ గట్ల వద్ద ఈ బాటిళ్లను పడవేయడం అత్యంత నిర్లక్ష్య పూరిత చర్య అని స్థానికులు మండిపడుతున్నారు. ఆ దారి వెంబడి వెళ్లే చిన్న పిల్లలు వాటిని తీసుకుని తాగితే వారి ఆరోగ్యం పాడైపోతుందని, దానికి ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నిస్తున్నారు. ఈ ప్లాస్టిక్ వ్యర్థాలు ఇలాగే పేరుకుపోవడం వల్ల పర్యావరణ కాలుష్యం పెరగడంతో పాటు, మేత కోసం వచ్చే పశువులు వీటిని తినే ప్రమాదం కూడా పొంచి ఉంది. మరోవైపు వర్షాకాలం ప్రారంభమవుతున్న నేపథ్యంలో, ఈ కెమికల్స్ కలిసిన పానీయాలు, చెత్త కాలువ నీటిలో కలిసిపోతే నీరు కాలుష్యమవడమే కాకుండా గ్రామాల వ్యాప్తంగా అంటువ్యాధులు తలెత్తే అవకాశం ఉందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఇంత పెద్ద మొత్తంలో ఎక్స్‌పైరీ ఉత్పత్తులు గ్రామ శివార్లకు ఎలా చేరాయనే విషయంపై సంబంధిత అధికారులు వెంటనే దర్యాప్తు చేపట్టి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. అలాగే మండలంలోని కూల్‌డ్రింక్స్, మినరల్ వాటర్ డీలర్లు, గోదాములపై ప్రత్యేక తనిఖీలు నిర్వహించి ఎక్స్‌పైరీ ఉత్పత్తుల వ్యవహారంపై పూర్తి స్థాయిలో విచారణ జరపాలని డిమాండ్ చేస్తున్నారు.

