epaper
Thursday, January 15, 2026
spot_img
epaper

నల్లమల సాగర్‌పై సుప్రీంకోర్టుకు తెలంగాణ

కలం, వెబ్‌డెస్క్: ఏపీ ప్రభుత్వం చేపడుతున్న పోలవరం, నల్లమలసాగర్ లింక్ (Polavaram Nallamala Sagar) ప్రాజెక్టుపై తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించబోతున్నది. ఈ మేరకు శనివారం సుప్రీంకోర్టులో కేసు దాఖలు చేయనుంది. ఇందుకు సంబంధించిన అన్ని ఆధారాలు, పత్రాలను ఇప్పటికే సిద్ధం చేసుకున్నట్లు నీటిపారుదల శాఖ వర్గాలు వెల్లడించాయి. గతంలో ఏపీ ప్రభుత్వం బనకచర్ల ప్రాజెక్టును నిర్మించ తలపెట్టిన విషయం తెలిసిందే. ఈ ప్రాజెక్టును తెలంగాణ ప్రభుత్వం తీవ్రంగా అడ్డుకున్నది. గతంలో ఏపీ ప్రభుత్వం ప్రతిపాదించిన పోలవరం–బనకచర్ల లింక్ ప్రాజెక్టుకు సంబంధించిన ప్రీ–ఫీజిబిలిటీ రిపోర్టును కేంద్ర జలశక్తి శాఖకు పంపింది. దీనిపై కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డులు, పోలవరం ప్రాజెక్టు అథారిటీ తీవ్ర అభ్యంతరాలు తెలిపాయి. పలు గోదావరి పరీవాహక రాష్ట్రాలు కూడా ఈ ప్రాజెక్టుపై అనేక సందేహాలు వ్యక్తం చేశాయి. ఈ క్రమంలో తెలంగాణ ప్రభుత్వం కూడా కేంద్ర జలశక్తి మంత్రిని, సెంట్రల్ వాటర్ కమిషన్ (సీడబ్ల్యూసీ)ను కలిసి అధికారికంగా అభ్యంతరాలు తెలియజేసింది. మరోవైపు ఏపీ ప్రభుత్వం ఈ లింక్ ప్రాజెక్టు డీపీఆర్‌కు టెండర్లు పిలవగా, తీవ్ర వ్యతిరేకత నేపథ్యంలో చివరికి వాటిని రద్దు చేసింది.

బనకచర్లకు బదులు నల్లమల సాగర్

పోలవరం–బనకచర్ల లింక్ ప్రాజెక్టులో మార్పులు చేస్తూ, బనకచర్లకు బదులు నల్లమలసాగర్‌కు  నీటిని తరలించే కొత్త లింక్ ప్రాజెక్టును ఏపీ ప్రభుత్వం తెరపైకి తీసుకొచ్చింది. గోదావరిపై నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్టు నుంచి సుమారు 200 టీఎంసీల నీటిని బొల్లాపల్లి రిజర్వాయర్(Bollapalli Reservoir) ద్వారా నల్లమలసాగర్‌కు తరలించాలన్న ప్రతిపాదనపై తెలంగాణ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. రాష్ట్ర విభజన చట్టం, ట్రైబ్యునల్ అవార్డులు, అంతర్‌రాష్ట్ర నదీజల నిబంధనలు అన్నింటినీ ఉల్లంఘిస్తూ, తెలంగాణ అభ్యంతరాలను పక్కనపెట్టి ఏపీ ఈ లింక్ ప్రాజెక్టును చేపడుతోందని నీటిపారుదల శాఖ ఇంజినీర్లు పేర్కొంటున్నారు. ఈ పరిస్థితుల్లో సుప్రీంకోర్టును ఆశ్రయించడం తప్ప మరే మార్గం లేదని వారు స్పష్టం చేస్తున్నారు.

న్యాయనిపుణులతో ఉత్తమ్ చర్చలు

సుప్రీంకోర్టులో కేసు దాఖలు, లేవనెత్తాల్సిన అంశాలు, న్యాయపరమైన వ్యూహంపై చర్చించేందుకు శనివారం దిల్లీలో నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి(Uttam Kumar Reddy) న్యాయ నిపుణులు, నీటి పారుదలశాఖ ఉన్నతాధికారులతో సమావేశం కానున్నారు. అనంతరం రాష్ట్ర ప్రభుత్వం తరఫున సుప్రీంకోర్టులో వాదనలు వినిపించనున్న సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీతో భేటీ కానున్నారు. ఈ సమావేశాల కోసం నీటిపారుదల శాఖ ఈఎన్సీ అంజద్ హుస్సేన్, అంతర్‌రాష్ట్ర జలవనరుల విభాగానికి చెందిన ఇంజినీర్లు ఇప్పటికే దిల్లీ చేరుకున్నారు. పోలవరం–నల్లమలసాగర్ లింక్ ప్రాజెక్టు(Polavaram Nallamala Sagar) వ్యవహారం న్యాయపరంగా కీలక దశకు చేరుకోవడంతో, ఈ అంశం రాబోయే రోజుల్లో మరింత ప్రాధాన్యం సంతరించుకునే అవకాశముందని అధికారులు అభిప్రాయపడుతున్నారు.

Read Also: జీఎస్‌డీపీలో తెలంగాణ టాప్.. ఆర్బీఐ నివేదిక విడుదల

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>