కలం, నాగర్ కర్నూల్ : డిఫాల్టర్లు అని మిల్లర్లను అరెస్టు చెయ్యడం ప్రభుత్వానికి తగదని నాగర్ కర్నూల్ జిల్లా రైస్ మిల్లర్ల సంఘం (Rice Millers Association) నాయకులు విజ్ఞప్తి చేశారు. మిల్లర్లపై ఎన్ఫోర్స్ మెంట్ దాడులు ఆపాలని కోరారు. శుక్రవారం జిల్లా కేంద్రంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో సంఘం అధ్యక్షుడు ప్రతాప్‌రెడ్డి, కార్యదర్శి బిల్లాకంటి రవి, కార్యవర్గ సభ్యులు నవీన్, సుధాకర్‌రావు మాట్లాడారు.
మిల్లర్లపై దాడులు చేస్తే సహించేది లేదని.. దాడులు ఇలానే కొనసాగిస్తే మిల్లుల తాళానలు మిల్లుల తాళాలను కలెక్టర్‌కు అప్పగిస్తామని హెచ్చరించారు. జిల్లా మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్యేలు జోక్యం చేసుకుని మిల్లర్ల సమస్యలను పరిష్కరించాల కోరారు. ప్రభుత్వానికి రావాల్సిన బకాయిలను డిఫాల్టర్ల నుంచి వసూలు చేయాలని.. అందరినీ ఇబ్బందులకు గురిచేయొద్దని రైస్ మిల్లర్ల నాయకులు విన్నవించారు. సీఎంఆర్‌లో వాస్తవ పరిస్థితుల్లో ఇప్పటి పరిస్థితులు పరిగణలోకి తీసుకోవాలన్నారు.
2024-25 సంవత్సరంలో లక్ష 84వేల మెట్రిక్ టన్నులకు గాను లక్ష 36వేల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ పూర్తి అయ్యిందని, కేవలం 20వేల మెట్రిక్ టన్నుల బియ్యమే మిగిలిందన్నారు. రబీ సీజన్లో బలవంతంగా పోలీసులను పెట్టి ధాన్యం బలవంతంగా లోడ్ చేయించారని ఆరోపించారు. సన్న బియ్యం పథకం మిల్లర్ల వల్లే విజయవంతం అయ్యిందని తెలిపారు. సీఎంఆర్‌పై ఆర్డర్ ఇవ్వడానికే ప్రభుత్వం మూడు నెలల టైమ్ తీసుకుందని దీంతో మిల్లులు అన్ని బంద్ ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
సిఎంఆర్పై కలెక్టర్ హామీ ఇచ్చి అమలు చేయలేదని వారు ఆరోపించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సఖ్యత లేకే మిల్లర్లకు సమస్యలు మొలకలు వచ్చిన ధాన్యం కూడా మాకు కట్టబెట్టారు అన్నారు. అయినా రైతులు, ప్రభుత్వం దృష్టిలో పెట్టుకొని సహకరించామని అన్నారు. సీఎంఆర్ విషయంలో మిల్లర్లు, అధికారులు, ప్రజాప్రతినిధులతో కమిటీ ఏర్పాటు చేసి స్థానిక పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవాలని కోరినట్లు వెల్లడించారు.
30 ఏళ్ల క్రితం ఉన్న పరిస్థితులకు అనుగుణంగా ప్రస్తుతం వ్యవహరించడం వల్ల సమస్యలు తలెత్తుతున్నాయన్నారు. గత బకాయిలను ప్రస్తుతం నడుస్తున్న మిల్లులపై రుద్దుతున్నారని ఆరోపించారు. ప్రభుత్వానికి చెల్లించాల్సిన బకాయిలు చెల్లించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. అయితే ముందుగా విజిలెన్స్ దాడులు నిలిపివేయాలని కోరారు.
ప్రభుత్వానికి ఉన్న అప్పులను రైస్ మిల్లర్లపై రుద్ది.. పంది కొక్కులు అంటూ సమాజంలో చీడ పురుగుల్లా చూడటం, అవమానకరంగా మాట్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రైస్ మిల్లర్ల వ్యవస్థను కాపాడాలని, మూడు రోజుల్లో చర్చలకు వచ్చి సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. లేకుంటే కలెక్టరు చేతికి మిల్లర్ల తాళాలు అప్పగిస్తామని స్పష్టం చేశారు.

