Mobile Popup Ad
Mobile Popup Ad

కోకాపేట్ భూముల రేట్లు కేక.. గజం రేట్ వింటే షాకే!

కలం, తెలంగాణ బ్యూరో : తెలంగాణ (Telangana) రాష్ట్రవ్యాప్తంగా భూముల విలువలు పెరిగాయి. మినిమం 10% నుంచి మాగ్జిమమ్ 100% మేర పెంచుతూ రెవెన్యూ శాఖ ల్యాండ్ వ్యాల్యూస్ ఫిక్స్ చేసింది. ఈ కొత్త విలువలు గురువారం నుంచే అమల్లోకి వచ్చాయి. కోకాపేట్ లాంటి ప్రాంతాల్లో భూముల విలువ డబుల్ అయింది. ఇంతకాలం చదరపు గజం రేట్ రూ.23,800 ఉంటే ఇప్పుడు అది రూ.47,600కు పెరిగింది. దీంతో ఎకరం కమర్షియల్ ల్యాండ్ రేటు ప్రభుత్వం ఫిక్స్ చేసిన వ్యాల్యూ ప్రకారం సుమారు రూ.24 కోట్లు ఉంది. కానీ ఓపెన్ మార్కెట్ రేటు దీనికి పది రెట్ల కంటే ఎక్కువే ఉన్నది. ఇటీవలే అక్కడ ఒక ఎకరం ధర రూ.237 కోట్లు పలికింది. కోకాపేట్ తరహాలోనే కొంగరకలాన్, బుద్వేల్, హఫీజ్‌పేట్, రాయదుర్గం, నాగోల్ తదితర ప్రాంతాల్లో భూముల విలువ గణనీయంగా పెరిగింది. రాష్ట్రంలోని మొత్తం 144 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో కొత్త విలువ ప్రకారమే రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి. అపార్టుమెంట్లకు మాత్రం గరిష్టంగా 20% విలువ పెరిగింది.

అగ్రికల్చరల్, కమర్షియల్ ఓపెన్ ప్లాట్స్‌కు డిమాండ్ :

రాష్ట్రవ్యాప్తంగా వ్యవసాయ భూముల మార్కెట్ విలువలను ప్రభుత్వం 50% నుంచి 100% మేర పెంచింది. ఓపెన్ ప్లాట్ల విలువల్లోనూ భారీ మార్పులే చేసింది. అపార్ట్‌మెంట్లకు మాత్రం 10% నుంచి 20% వరకే పెంచింది. ఓపెన్ మార్కెట్ రేట్లు, ప్రభుత్వ విలువలకు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని తగ్గించాలన్న ఉద్దేశంతో ఈ మార్పులు చేసినట్లు ప్రభుత్వం చెప్తున్నది. రాష్ట్రంలో వ్యవసాయ భూముల విలువ ఎకరాకు కనిష్ఠంగా గతంలో రూ.1.75 లక్షలు ఉంటే ఇప్పుడు రూ.2.75 లక్షలకు పెరిగింది. గరిష్ఠ స్థాయిలో హైదరాబాద్‌లోని బేగంపేట ప్రాంతంలో ఎకరాకు రూ.35.29 కోట్లు ఉంటున్నది. ఓఆర్ఆర్ పరిధిలోని అనేక ప్రాంతాల్లో భూముల విలువ గణనీయంగా పెరిగింది. జిల్లాల్లోనూ భూముల విలువల్లో మార్పులు జరిగాయి. ఉదాహరణకు నల్లగొండ టౌన్‌లో ఎకరం భూమి విలువ ఇంతకాలం రూ. 2.25 లక్షలు ఉంటే ఇప్పుడు అది రూ. 3.93 లక్షలకు పెరిగింది. మిర్యాలగూడలో రూ. 4.5 లక్షల నుంచి రూ. 6.75 లక్షలకు, కరీంనగర్ రూరల్‌లో రూ. 5.25 లక్షల నుంచి రూ. 6.03 లక్షలకు, నిజామాబాద్ రూరల్‌లో రూ. 78.40 లక్షల నుంచి రూ. 90.16 లక్షలకు పెరిగింది.

కమర్షియల్ ఓపెన్ ప్లాట్ల వ్యాల్యూస్ కీలకం :

ప్రభుత్వం సవరించిన ల్యాండ్ వ్యాల్యూస్‌లో నగర శివారు ప్రాంతాల్లోని కమర్షియల్ భూముల ధరలకు రెక్కలొచ్చాయి. అత్యధికంగా కోకాపేటలో చదరపు గజం రూ.23,800 నుంచి రూ.47,600కు పెరిగింది. అత్తాపూర్‌లో రూ.20,300 నుంచి రూ.30,500కు, కొంపల్లిలో రూ.11,600 నుంచి రూ.17,400కు పెరిగింది. హనుమకొండలో గజం విలువ రూ.5,800 నుంచి రూ.8,700కు, కాజీపేటలో రూ.9,500 నుంచి రూ.14,250కు పెరిగింది. హైదరాబాద్‌లోని అజంపురా, మాసాబ్‌ట్యాంక్ ప్రాంతాల్లో చదరపు అడుగు విలువ రూ.2,500 నుంచి రూ.2,700కు పెరిగింది. ఆమనగల్లులో రూ.1,300 నుంచి రూ.1,600కు పెరిగింది. మంకాల్, మోకిల, కొంపల్లి ప్రాంతాల్లో రూ. 2,200 నుంచి రూ. 2,700కు చేరింది. బాలానగర్, పటాన్‌చెరు ప్రాంతాల్లో చదరపు అడుగు విలువ రూ.3,000గా నిర్ణయించారు. ఓపెన్ మార్కెట్ ధరలు, ప్రభుత్వ విలువల మధ్య వ్యత్యాసం లేని ప్రాంతాల్లో మార్పులు జరగలేదు. కానీ అభివృద్ధి వేగంగా జరుగుతున్న ఓఆర్ఆర్ పరిధి, ప్రధాన రహదారులు, వాణిజ్య కేంద్రాల సమీప ప్రాంతాల్లో మాత్రం భారీగానే పెరిగింది. మార్కెట్ విలువలు పెరిగినా రిజిస్ట్రేషన్ ఛార్జీలు యధావిధిగా 7.5% కొనసాగనున్నది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>