Mobile Popup Ad
Mobile Popup Ad

తెలంగాణ – కర్నాటక.. బోర్డర్‌లో ‘చెత్త’ పంచాయితీ!

కలం, మెదక్ బ్యూరో: ఒక రాష్ట్రం చెత్త.. మరో రాష్ట్రం ప్రజలకు శాపంగా మారింది. కర్నాటకలోని బీదర్ నగర చెత్త తెలంగాణ (Telangana – Karnataka) సరిహద్దు గ్రామాల ప్రాణాల మీదకు తెచ్చింది. కాలుష్యంతో ఊపిరాడక గ్రామస్తులు తిరగబడటంతో సరిహద్దులో ‘చెత్త పంచాయితీ’ రాజుకుంది. ఆగ్రహించిన బీదర్ అధికారులు ఏకంగా రోడ్డుపైనే చెత్త కుప్పలు పోయడంతో రెండు రాష్ట్రాల మధ్య రాకపోకలు స్తంభించిపోయాయి.

తెలంగాణ – కర్నాటక సరిహద్దులో చెత్త పంచాయితీ తీవ్రరూపం దాల్చింది. రెండు రాష్ట్రాల మధ్య డంపింగ్ యార్డు వివాదం ఇప్పుడు ప్రజా సమస్యగా మారింది. సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలంలోని మల్గి గ్రామం ఈ వివాదానికి కేంద్రంగా నిలిచింది. మల్గి గ్రామానికి ఆనుకునే కర్నాటకలోని బీదర్ మున్సిపల్ కార్పొరేషన్ ఉంది. ఇక్కడి చెత్తను సరిహద్దు ప్రాంతంలోని డంపింగ్ యార్డుకు తరలిస్తున్నది. ఈ స్థలం కర్నాటక భూభాగంలో ఉన్నప్పటికీ.. తెలంగాణలోని మల్గి గ్రామానికి అతి సమీపంలో ఉండటంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

కాలుష్యంతో అనారోగ్య సమస్యలు

బీదర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో సుమారు మూడు లక్షల జనాభా ఉండగా, నగరంలోని చెత్తను 20 ఎకరాలకు పైగా విస్తీర్ణంలోని స్థలంలో రోజూ డంప్ చేస్తున్నారు. చెత్తను శాస్త్రీయంగా నిర్వహించకుండా బహిరంగంగా కాల్చడం వల్ల దట్టమైన పొగ, భరించలేని దుర్వాసన వ్యాపిస్తున్నది. నిత్యం చెత్త వాహనాలు మల్గి గ్రామం మీదుగా రాకపోకలు సాగిస్తుండటంతో పారిశుధ్య సమస్యలు మరింత తీవ్రమయ్యాయి. కాలుష్యం కారణంగా అనారోగ్య సమస్యలతో ఇబ్బందులు పడుతున్నామని గ్రామస్తులు చెప్తున్నారు.

తిరగబడ్డ మల్గి జనం

ఏండ్లు కొనసాగుతున్న ఈ సమస్యపై విసిగిపోయిన మల్గి గ్రామస్తులు రెండు నెలల క్రితం బీదర్ మున్సిపల్‌కు చెందిన చెత్త వాహనాలను అడ్డుకున్నారు. డంపింగ్ యార్డు వద్దకు చేరుకుని పెద్దఎత్తున నిరసన తెలిపారు. అప్పట్లో అధికారులు సమస్య పరిష్కరిస్తామని హామీ ఇచ్చినా ఎలాంటి మార్పు రాలేదని గ్రామస్తులు అంటున్నారు. గత 15 రోజులుగా గ్రామ యువకులు చెత్త వాహనాలను సరిహద్దులోనే అడ్డుకుంటున్నారు. దీంతో వందలాది చెత్త వాహనాలు రోడ్డుపైనే నిలిచిపోయాయి. ఈ నేపథ్యంలో బీదర్ మున్సిపల్ అధికారులు గ్రామస్తులను బెదిరిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.

రోడ్డుపైనే చెత్త పారబోత.. ఉద్రిక్తత

గ్రామస్తుల నిరసన కారణంగా చెత్త వాహనాలు నిలిచిపోవడంతో సుమారు 40 వాహనాల్లోని చెత్తను బీదర్–మల్గి మధ్య రోడ్డుపైనే పారబోసి వెళ్లిపోయారు. మల్గి గ్రామస్తులు బీదర్‌కు వెళ్లకుండా అడ్డుకునేలా రోడ్డుకు అడ్డంగా చెత్త కుప్పలు పోశారని స్థానికులు ఆరోపిస్తున్నారు. దీంతో రెండు రాష్ట్రాల మధ్య రాకపోకలు పూర్తిగా నిలిచిపోయి సరిహద్దు ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రోడ్డుపై చెత్త పారబోసిన ఘటనపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తడంతో బీదర్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు బుధవారం సాయంత్రం నుంచి జేసీబీల సహాయంతో రోడ్డుపై ఉన్న చెత్తను తొలగించారు.

పరిష్కారం చూపాలని డిమాండ్

బీదర్ మున్సిపల్ అధికారుల తీరుపై మల్గి గ్రామంతో పాటు పరిసర గ్రామాల ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సమస్యను పరిష్కరించాల్సిన అధికారులు దౌర్జన్యానికి పాల్పడటం బాధాకరమని అంటున్నారు. డంపింగ్ యార్డును శాస్త్రీయంగా నిర్వహించాలని, చెత్తను బహిరంగంగా కాల్చడం నిలిపివేయాలని, చెత్త వాహనాలకు ప్రత్యామ్నాయ మార్గం ఏర్పాటు చేయాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. దాదాపు రెండు నెలలుగా సమస్య కొనసాగుతున్నప్పటికీ తెలంగాణ అధికారులు స్పందించకపోవడం పట్ల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కర్నాటక చెత్త సమస్య నుంచి తమను కాపాడాలని రాష్ట్ర ప్రభుత్వం, సంగారెడ్డి జిల్లా అధికారులను మల్గి గ్రామంతో పాటు సరిహద్దు గ్రామాల ప్రజలు కోరుతున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>