కలం, మహబూబ్ నగర్ బ్యూరో: రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్లతో యువతకు ఆధునిక సాంకేతిక నైపుణ్యాలను అందించి మెరుగైన ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నట్లు రాష్ట్ర కార్మిక, ఉపాధి, శిక్షణ శాఖల మంత్రి వివేక్ వెంకటస్వామి (Vivek Venkataswamy) అన్నారు. ఆదివారం దేవరకద్ర నియోజకవర్గం చిన్నచింతకుంట మండలం పల్లమడి గ్రామంలో ఏటీసీకి ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డితో కలిసి మంత్రి శంకుస్థాపన చేశారు. అనంతరం నిర్వహించిన సభలో మాట్లాడుతూ.. పల్లమడి ప్రాంతానికి త్వరలో బ్రిడ్జి నిర్మాణం పూర్తయితే, ఈ ప్రాంతానికి రాకపోకలు మరింత సులభతరం అవుతాయన్నారు. చుట్టుపక్కల గ్రామాల యువత కూడా ఏటీసీకి వచ్చి నైపుణ్య శిక్షణ పొందే అవకాశం ఉంటుందని తెలిపారు.
యువతకు నైపుణ్యమే భవిష్యత్‌కు బాట..
రాష్ట్ర వ్యాప్తంగా రూ.4 వేల కోట్లతో 119 అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి వివేక్ తెలిపారు. గతంలో ఉన్న 65 ఐటీఐలను కూడా ఆధునీకరించి ఏటీసీలుగా అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. ఈ కేంద్రాల్లో ఎలక్ట్రిషీయన్, వెల్డర్, ఎలక్ట్రిక్ వాహనాల నిర్వహణ, రోబోటిక్స్, CNC మెషిన్ ఆపరేషన్ వంటి ఆధునిక కోర్సుల్లో శిక్షణ అందిస్తామని తెలిపారు. రూ.20 వేల నుంచి రూ.30 వేల వరకు వచ్చే ఉద్యోగాలకే పరిమితం కాకుండా, ఆధునిక సాంకేతిక నైపుణ్యాలను అభివృద్ధి చేసుకుని అధిక వేతనాలు పొందేలా యువతను తీర్చిదిద్దాల్సిన అవసరం ఉందని అన్నారు.
ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు రాష్ట్ర ప్రభుత్వం రెండు లక్షల ఉద్యోగాల భర్తీ దిశగా ముందుకు సాగుతోందని, ఇప్పటికే సుమారు లక్ష ఉద్యోగాలను భర్తీ చేసిందని మంత్రి వివేక్ తెలిపారు. సుమారు 50 వేల ఉపాధ్యాయ ఉద్యోగాలు, వైద్య రంగంలో అవసరాలకు అనుగుణంగా సుమారు 10 వేల నర్సింగ్ ఉద్యోగాలు భర్తీ చేసినట్లు వివరించారు.
విదేశాల్లోనూ మెరుగైన ఉపాధి అవకాశాలు..
విదేశీ భాషలు నేర్చుకుంటే జర్మనీ, జపాన్, యూరప్ తదితర దేశాల్లో కూడా మెరుగైన ఉద్యోగ అవకాశాలను పొందవచ్చని మంత్రి వివేక్ అన్నారు. ATC కేంద్రాల్లో శిక్షణ పొందిన యువతకు విదేశాల్లో కూడా ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. వచ్చే ఏడాది ఈ ప్రాంతానికి వచ్చే సమయానికి కనీసం వంద మంది యువతకు శిక్షణ అందించి జర్మనీలో ఉద్యోగ అవకాశాలు కల్పించేలా కృషి చేస్తామని పేర్కొన్నారు. జపాన్‌లోనూ నైపుణ్యం కలిగిన ఇంజనీర్లకు మంచి అవకాశాలు ఉన్నాయని తెలిపారు.
శిక్షణ పొందే విద్యార్థులకు స్టైఫండ్..
ఏటీసీ కేంద్రాల్లో శిక్షణ పొందే విద్యార్థులకు ప్రభుత్వం నెలకు రూ.2,000 స్టైఫండ్ అందించాలని నిర్ణయించిందని మంత్రి వివేక్ తెలిపారు. ప్రస్తుతం ఉన్న ఈ ఏటీసీ సెంటరుని100 మంది విద్యార్థులతో విజయవంతంగా నడిపిస్తే, వచ్చే సంవత్సరం మరో ఏటీసీ సెంటర్ మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. దేవరకద్ర నియోజకవర్గంలో బీడీ కార్మికుల సంఖ్య ఎక్కువగా ఉన్నందున వారి ఆరోగ్య పరిరక్షణ కోసం ఈఎస్ఐ డిస్పెన్సరీ మంజూరు సంబంధించిన ప్రతిపాదనలు సంబంధిత శాఖ కార్యదర్శికి పంపించినట్లు వివరించారు.
దేవరకద్రలో వేగంగా అభివృద్ధి పనులు..
దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ.. సి.సి.కుంటలో రూ.43.4 కోట్లతో ఏర్పాటు చేయనున్న ఏటీసీ సెంటరులో ఆరు విభాగాల్లో నైపుణ్య శిక్షణ కార్యక్రమాలు అందిస్తారని అన్నారు. నియోజకవర్గంలో డిగ్రీ కళాశాల ఏర్పాటు, చిన్న చింతకుంటలో జూనియర్ కళాశాల ఏర్పాటు చేశామన్నారు. అలాగే దమగ్నాపూర్ గ్రామంలో రూ.200 కోట్లతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ పాఠశాల నిర్మాణం జరుగుతోందన్నారు. దేవరకద్రలో వంద పడకల ఆసుపత్రి, సివిల్ జడ్జి కోర్టు ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు.
భూత్పూర్ మండలంలో మిధాని కర్మాగారం ఏర్పాటుకు సంబంధించిన భూ సేకరణ కార్యక్రమాలను వేగవంతం చేసినట్లు ఎమ్మెల్యే తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక రెండున్నరేళ్లలోనే చిన్న చింతకుంట మండలంలోనే రూ.450 కోట్లతో అభివృద్ధి పనులను చేపట్టినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్, రాష్ట్ర ఉపాధి, శిక్షణ సంస్థ డైరెక్టర్ రాజేష్, జాయింట్ డైరెక్టర్ నరేష్, రీజనల్ డిప్యూటీ డైరెక్టర్ సీతారాములు, జిల్లా ఉపాధి కల్పన అధికారి మైత్రి ప్రియ, సి సి. కుంట తహసీల్దార్ ఎల్లన్న, మహమ్మద్ అల్తాఫ్ అసిస్టెంట్ కమిషనర్ లేబర్, ఎంపీడీవో అనురాధ, పల్లెమర్రి సర్పంచి లక్ష్మి పాల్గొన్నారు.

