కలం, వెబ్ డెస్క్ : రాజకీయ శక్తిగా మారేందుకు తెలంగాణ జాగృతి (Telangana Jagruthi) వేగంగా అడుగులు వేస్తోంది. ఈ క్రమంలో శనివారం తెలంగాణ జాగృతి ప్రధాన కార్యాలయంలో జాగృతి స్టీరింగ్ కమిటీ భేటీ అయింది. రాష్ట్రంలో గత 12 సంవత్సరాల్లో వైద్య రంగంలో నెలకొన్న పరిస్థితులు, ప్రజల అవసరాలు, సమస్యలపై సమగ్ర పరిశీలన చేయాలని హెల్త్ కమిటీ సభ్యులకు సూచించారు. వీటిపై కేస్ స్టడీస్‌ను నివేదికలో తప్పనిసరిగా పొందుపరచాలని, క్షేత్ర స్థాయిలో పర్యటించి పూర్తి సమాచారం సేకరించాలని ఆదేశించారు. రాజకీయ పార్టీగా అవతరించనున్న తెలంగాణ జాగృతి ప్రధాన లక్ష్యాల్లో వైద్య రంగం కీలకమని, దీనిపై బలమైన నివేదిక తయారు చేయాలని సూచించారు. హెల్త్ కమిటీ సభ్యులు ఇప్పటికే సేకరించిన సమాచారాన్ని సమావేశంలో వివరించారు.
తెలంగాణ జాగృతి (Telangana Jagruthi) అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత (Kavitha) ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా 23 ప్రత్యేక కమిటీలు ఏర్పాటయ్యాయి. బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలన, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోని రెండేళ్లలో వివిధ శాఖల పరిస్థితి, సంక్షేమ పథకాల అమలు, బడ్జెట్‌లో ప్రకటించిన నిధుల విడుదల వంటి అంశాలపై అధ్యయనం చేయడమే ఈ కమిటీల లక్ష్యం. దళిత జాగృతి, ఆదివాసీ జాగృతి, మహిళా జాగృతి, రైతు జాగృతి, వర్తక జాగృతి, బీసీ జాగృతి, యువ జాగృతి, సాహిత్య జాగృతి తదితర విభాగాలతో పాటు వైద్య రంగంపై ప్రత్యేక దృష్టి సారించారు. జనం జాగృతి బాటలో (Janam Bata) భాగంగా ఈ కమిటీలు సేకరించే సమాచారాన్ని కవిత ప్రస్తావిస్తూ, ప్రభుత్వాల వైఫల్యాలపై ఏకరవు పెడుతున్నారు. ఈ నెల 17 నాటికి అన్ని కమిటీల నివేదికలు స్టీరింగ్ కమిటీకి సమర్పించాలని, ఆ తర్వాత విస్తృత కార్యవర్గ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకునేందుకు జాగృతి సన్నద్ధమవుతోంది.
Read Also: నుమాయిష్‌లో భద్రతా పాఠాలు: పోలీసు స్టాల్స్‌ను ప్రారంభించిన సీపీ
Follow Us On: Instagram


