కలం, వెబ్ డెస్క్: సమాజంలో కుల, వర్ణ, లింగ బేధాలు లేకుండా సమానత్వ విధానం ఉండాలని బసవేశ్వరుడు (Basaveshwara) భావించారని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, కల్వకుంట్ల కవిత (Kavitha) అన్నారు. బసవేశ్వరుడి 839వ జయంతి సందర్భంగా నేడు కవిత ట్యాంక్ బండ్ వద్ద ఉన్న బసవేశ్వర విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ.. 839 ఏళ్ల క్రితం బసవేశ్వరుడి రూపంలో కొత్త విప్లవం పుట్టిందన్నారు. నాడు బసవేశ్వరుడు పాటించిన ప్రజాస్వామిక విలువలు, తీసుకువచ్చిన మార్పులను నేటకీ స్మరించుకుంటున్నామన్నారు. కుల, వర్ణ, లింగ బేధాలు లేకుండా సొసైటీలో అందరూ కలిసి ఉండాలని, అభివృద్ధి జరగాలని, స్త్రీ, పురుష బేధాలు లేకుండా సమాన అవకాశాలు రావాలని ఆయన చెప్పారన్నారు. ఆయన చెప్పిన సమానత్వం, సమాన అవకాశాల కోసం నేటికీ పాటుపడుతున్నామని కవిత తెలిపారు. ఈ పరిస్థితి చూస్తే మనం ఎంత వెనుకబడి ఉన్నామో అర్థం అవుతోందని స్పష్టం చేశారు.
ఇక ఇటీవల పార్లమెంట్‌లో మహిళా బిల్లును పాస్ కాకుండా అనేక శక్తులు కుట్రలు చేసి అడ్డుకున్నాయని కవిత అన్నారు. మహిళా బిల్లు వీడిపోవడం చాలా దారుణమన్నారు. రాష్ట్రంలో 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఒక పార్టీ మహిళలకు ఎనిమిది సీట్లు ఇస్తే.. మరో పార్టీ పది సీట్లు ఇచ్చిందని గుర్తు చేశారు. ఒక పార్టీలో ముగ్గురు గెలిస్తే, మరో పార్టీలో ఐదుగురు గెలిచారన్నారు. మొత్తంగా మహిళల ప్రాతినిధ్యం చాలా తక్కువగా ఉందన్నారు. బసవేశ్వరుడి స్ఫూర్తితో రాజకీయ పార్టీలు మారుతాయని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు. తాను కూడా త్వరలో కొత్త పార్టీ పెడతున్నానని, బసవేశ్వరుడి స్ఫూర్తితో సమానత్వం కోసం పోరాడతానని తెలిపారు. తాను పెట్టబోయే పార్టీ పదవుల్లో, ఎన్నికల్లో మహిళలకు 33 శాతానికి తక్కువ కాకుండా అవకాశం కల్పిస్తామని కవిత స్పష్టం చేశారు. బసవేశ్వరుడి నుంచి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ స్ఫూర్తి పొందారని, దేశ మార్పు కోసం ప్రతి ఒక్కరూ బసవేశ్వరుడి బాటలో నడవాలన్నారు. తాను ఏర్పాటు చేయబోయే రాజకీయ పార్టీ ఆయన స్ఫూర్తితో సామాజిక న్యాయం కోసం పని చేస్తుందని స్పష్టం చేశారు.

