కలం, వెబ్ డెస్క్ : ఆఫ్ఘనిస్తాన్ (Afghanistan) స్టార్ లెగ్ స్పిన్నర్ రషీద్ ఖాన్ (Rashid Khan) తన దేశభక్తిని మరోసారి చాటుకున్నారు. భారత్, ఆస్ట్రేలియా వంటి అగ్రరాజ్యాల నుంచి వచ్చిన పౌరసత్వ ఆఫర్లను ఆయన సున్నితంగా తిరస్కరించినట్లు వెల్లడించారు. తన జీవిత ప్రయాణాన్ని వివరించే ‘రషీద్ ఖాన్: ఫ్రమ్ స్ట్రీట్స్ టు స్టార్‌డమ్’ (Rashid Khan: From Streets to Stardom) పుస్తకంలో ఈ విషయాలను పేర్కొన్నారు. రషీద్ ఖాన్ (Rashid Khan) ప్రతిభకు ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. ముఖ్యంగా ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున అద్భుత ప్రదర్శనలతో భారత అభిమానుల హృదయాలను గెలుచుకున్నారు.
2018లో కోల్‌కతా జట్టుపై ఆయన చేసిన అద్భుత ప్రదర్శన తర్వాత, సోషల్ మీడియాలో ఆయనకు భారత పౌరసత్వం ఇవ్వాలని పెద్ద ఎత్తున డిమాండ్లు వినిపించాయి. ఇక 2023 ఐపీఎల్ సీజన్ సమయంలో ఒక సీనియర్ క్రికెట్ ప్రతినిధి ఆయనను కలిసి, ఆఫ్ఘనిస్తాన్‌లో పరిస్థితులు బాగోలేదని, భారత్‌లోనే స్థిరపడాలని సూచించినట్లు రషీద్ చెప్పారు. అయితే ఆ ప్రతిపాదనను ఆయన వినయంగా తిరస్కరించి, ‘నేను నా దేశం కోసం మాత్రమే ఆడతాను’ అని స్పష్టం చేశారు. భారత్‌తో పాటు ఆస్ట్రేలియా నుంచి కూడా ఇలాంటి ఆఫర్లు వచ్చాయని, కానీ తన దేశాన్ని వదిలి వేరే ఏ దేశం తరఫున కూడా ఆడనని ఆయన ఖచ్చితంగా తెలిపారు. రషీద్ ఖాన్‌కు తన దేశం పట్ల ఉన్న అంకితభావం, గౌరవం ఈ నిర్ణయం ద్వారా మరింత స్పష్టమవుతోంది.

