కలం, తెలంగాణ బ్యూరో : పెట్టుబడుల ఆకర్షణ, కొత్త యూనిట్ల స్థాపన, విదేశీ కంపెనీలతో అవగాహనా ఒప్పందాలు.. ఇలాంటివన్నీ రాష్ట్ర ప్రభుత్వం గొప్పగా చెప్పుకునే అంశాల్లో కొన్ని గతేడాది డిసెంబరులో జరిగిన గ్లోబల్ సమ్మిట్‌లో ఐదు లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు పెట్టేందుకు వివిధ కంపెనీలతో అవగాహనా ఒప్పందాలు కుదిరాయి. దానికి ముందు దావోస్ సమ్మిట్‌లలో దాదాపు రెండు లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు పెట్టేలా ఎంఓయూలు జరిగాయి. ఇంత కీలకమైన శాఖకు దాదాపు ఏడాది నుంచి స్థిరంగా ఉండే కార్యదర్శి కరువయ్యారు. గత ప్రభుత్వంలో దాదాపు తొమ్మిదేండ్లకు పైగా జయేశ్ రంజన్ ఐటీ, ఇండస్ట్రీస్ (Telangana IT and Industries) సెక్రటరీగా కొనసాగారు. కాంగ్రెస్ ప్రభుత్వంలోనూ గతేడాది ఏప్రిల్ వరకూ ఆయనే కార్యదర్శి. ఆయనను సీఎంఓలోకి బదిలీ చేసిన తర్వాత ఈ శాఖకు ఫుల్ టైమ్ కార్యదర్శి స్థిరంగా లేకపోవడం వెలితి అంటూ సచివాలయ వర్గాల్లోనే టాక్ మొదలైంది.
కీలకమైన శాఖలో ఈ సంక్షోభం ఎందుకు?
రాష్ట్రానికి పెట్టుబడులు రావడం ద్వారా అంతర్జాతీయ స్థాయిలో ఇమేజ్ పెరగడమే కాకుండా కొత్త యూనిట్లు ఏర్పడతాయని, రాష్ట్ర ఆర్థికాభివృద్ధి మెరుగుపడుతుందని, ఉపాధి అవకాశాలు లభిస్తాయనేది ప్రభుత్వ వాదన. గత ప్రభుత్వంలోకంటే రెండున్నరేండ్లలో రాష్ట్రానికి పెట్టుబడుల వరద వచ్చిందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్‌బాబు పలుమార్లు చెప్పారు. కానీ జయేశ్ రంజన్ (Jayesh Ranjan) బదిలీ మీద సీఎంఓకు వెళ్ళిన తర్వాత ఐటీ, పరిశ్రమల శాఖకు స్థిరమైన అధికారి ఎవ్వరూ లేరన్నది ఐఏఎస్ ఆఫీసర్ల మధ్యనే చర్చ జరుగుతున్నది. ఈ శాఖకు వెళ్ళడానికి అధికారులు ఎందుకు సిద్ధపడడంలేదు?.. ఒకవేళ వెళ్లినా ఎందుకు అక్కడ నిలదొక్కుకోలేకపోతున్నారు?.. కొంతమంది బదిలీ అయినా బాధ్యతలు ఎందుకు తీసుకోవడంలేదు?.. ఇలాంటి ప్రశ్నలకు సమాధానం కరువవుతున్నది. ప్రస్తుతం ఈ శాఖకు ఫుల్‌టైమ్ కార్యదర్శే లేరు.
సీరియస్ ఐఏఎస్ ఆఫీసర్ల మధ్య కోల్డ్ వార్ :
జయేశ్ రంజన్ సీఎంఓకు బదిలీ అయిన తర్వాత ఐటీ, పరిశ్రమల (Telangana IT and Industries) శాఖ కార్యదర్శిగా సంజయ్ కుమార్ నియమితులయ్యారు. ఆయన బాధ్యతలు చేపట్టిన తర్వాత డిసెంబరులో ఫ్యూచర్ సిటీలో గ్లోబల్ సమ్మిట్, ఆ తర్వాత జనవరిలో దావోస్ సమ్మిట్ జరిగాయి. ఆ శాఖ కార్యదర్శి హోదాలో ఈ రెండూ ఆయన చూసుకున్నారు. పేరుకు పుల్ టైమ్ సెక్రటరీ అయినా పాత కార్యదర్శి నుంచి లాగిన్ ఐడీలు అందలేదని, పూర్తి స్వేచ్ఛతో పనిచేసే వాతావరణం లేదనే ఆరోపణలు అప్పట్లో వెలువడ్డాయి. సీఎంఓ నుంచే పరోక్షంగా కార్యదర్శి తరహా బాధ్యతలు చూస్తున్నారని, ఈ శాఖ నుంచి రిలీవ్ అయ్యి వెళ్ళిపోయినా సీఎంఓలో ‘స్పీడ్’ (స్మార్ట్, ప్రోయాక్టివ్, ఎఫిషియంట్ అండ్ ఎఫెక్టివ్ డెలివరీ) బాధ్యతల పేరుతో ఐటీ, పరిశ్రమల శాఖకు షాడో సెక్రటరీగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు కూడా వచ్చాయి. సంజయ్ కుమార్ అసంతృప్తితోనే పనిచేయాల్సి వస్తున్నదనే మాటలు సచివాలయ వర్గాల్లో వినిపించాయి.
బాధ్యతలు తీసుకోడనికి ఓ అధికారి ససేమిరా :
కీలకమైన ఇండస్ట్రీస్ డిపార్టుమెంటులో సంజయ్ కుమార్ అసంతృప్తి ఆరోపణలకు కొనసాగింపుగా ఈ ఏడాది ఫిబ్రవరిలో ఆయన పంచాయతీరాజ్ శాఖకు బదిలీ అయ్యారు. ఆ స్థానంలో మైనింగ్ డిపార్టుమెంటు చూస్తున్న ఎన్.శ్రీధర్‌ను ప్రభుత్వం ఫిబ్రవరిలో ఫుల్ అడిషనల్ ఛార్జెస్ పేరుతో నియమించింది. అప్పటి నుంచి ఆయన బాధ్యతలే తీసుకోలేదు. మైనింగ్ డిపార్టుమెంటుకు మాత్రమే పరిమితమయ్యారు. రెండున్నర నెలల అనంతరం నాలుగు రోజుల క్రితం జరిగిన బదిలీల్లో భాగంగా ఇంటర్‌మీడియెట్ బోర్డు నుంచి కృష్ణ ఆదిత్యకు ఐటీ, పరిశ్రమల శాఖ స్పెషల్ సెక్రటరీ బాధ్యతలు అప్పజెప్పింది.
కానీ ఆయన అప్పటికే 47 రోజుల లాంగ్ లీవ్‌లో ఉన్నారు. జాయింట్ సెక్రటరీగా అనుదీప్ దురిశెట్టిని ప్రభుత్వం నియమించింది. కానీ ఈ శాఖకు పూర్తిస్థాయి సెక్రటరీ మాత్రం కరువయ్యారు. కీలకమైన ఈ శాఖకు దాదాపు తొమ్మిదేండ్లకు పైగా పనిచేసిన జయేశ్ రంజన్ వెళ్ళిపోయిన తర్వాత స్థిరంగా ఏ ఆఫీసర్ కూడా కంటిన్యూ కాలేకపోతున్నారన్నది సచివాలయ వర్గాల్లో హాట్ టాపిక్.
Read Also: పార్టీకి, ప్రభుత్వానికి గ్యాప్.. పార్టీ పెద్దల వద్దకు మ్యాటర్
Follow Us On: WhatsApp

