వ్యసనాలకు బానిసైతే భవిష్యత్తు అంధకారమే: ఈగల్ ఫోర్స్ ఎస్పీ

కలం, నారాయణపేట: వ్యసనాలకు బానిసైతే భవిష్యత్తు అంధకారమేనని తెలంగాణ ఈగల్ ఫోర్స్ ఎస్పీ పీవీ.పద్మజ అన్నారు. తెలంగాణ ఈగల్ ఫోర్స్, నారాయణపేట (Narayanpet) జిల్లా పోలీసు శాఖ సంయుక్త ఆధ్వర్యంలో గురువారం జిల్లా కేంద్రంలోని ఎస్‌ఆర్ గార్డెన్‌లో డ్రగ్స్ వ్యతిరేకంగా భారీ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఏ కార్యక్రమానికి తెలంగాణ ఈగల్ ఫోర్స్ ఎస్పీ పీవీ. పద్మజ, కలెక్టర్ సీహెచ్ ప్రియాంక, జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ లు హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఎస్పీ పీవీ పద్మజ (EAGLE Force SP Padmaja) మాట్లాడుతూ.. బంగారు భవిష్యత్తు కోసం యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలన్నారు. ప్రతి విద్యార్థి యాంటీ డ్రగ్ సోల్జర్‌గా మారాలని సూచించారు. డ్రగ్స్ నిర్మూలనలో ప్రభుత్వం మాత్రమే కాకుండా ప్రతి పౌరుడి భాగస్వామ్యం ఎంతో అవసరమని పేర్కొన్నారు. నారాయణపేట జిల్లాను డ్రగ్స్ రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతతో ముందుకు రావాలని పిలుపునిచ్చారు. యువత తమ జీవిత లక్ష్యాలను దృష్టిలో పెట్టుకుని చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని సూచించారు. స్నేహితులు లేదా పరిచయస్తుల్లో ఎవరైనా డ్రగ్స్ వినియోగిస్తున్నట్లు తెలిసినా, విక్రయిస్తున్నట్లు గమనించినా వెంటనే 1908 టోల్ ఫ్రీ నంబర్‌కు లేదా సమీప పోలీసు అధికారులకు సమాచారం అందించాలని కోరారు.

కలెక్టర్ సీహెచ్ ప్రియాంక మాట్లాడుతూ… మాదకద్రవ్యాల (Anti Drug Awareness) విషయంలో ఎలాంటి ప్రలోభాలకు గురికావద్దని విద్యార్థులకు సూచించారు. “ఒక్కసారి తీసుకుంటే ఎవరికీ తెలియదు” అనే భావన పూర్తిగా తప్పని స్పష్టం చేశారు. డ్రగ్స్‌కు ప్రోత్సహించే వారు నిజమైన స్నేహితులు కాదని, చెడు అలవాట్లకు “నో ” చెప్పగలిగే ధైర్యమే నిజమైన వ్యక్తిత్వమన్నారు.

ఎస్పీ డాక్టర్ వినీత్ మాట్లాడుతూ.. డ్రగ్స్ అనేవి దేశ భవిష్యత్తును నాశనం చేసే టెర్రరిజానికి సమానమైన మహమ్మారి అని పేర్కొన్నారు. యువత అధికంగా ఉన్న భారతదేశాన్ని బలహీనపరచడానికి డ్రగ్స్‌ను ఒక ఆయుధంగా ఉపయోగించే ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. ఒక దేశాన్ని నాశనం చేయాలంటే అణుబాంబులు అవసరం లేదని, ఆ దేశ యువతను చెడు వ్యసనాలకు బానిస చేస్తే చాలన్నారు. డ్రగ్స్‌కు అలవాటు పడిన యువత వ్యక్తిగతంగా, కుటుంబపరంగా, సామాజికంగా తీవ్ర నష్టాలను ఎదుర్కొంటారని, దేశ అభివృద్ధిపైనా దీని ప్రభావం తీవ్రంగా ఉంటుందని పేర్కొన్నారు. డ్రగ్స్ జాతీయ భద్రతకు కూడా ముప్పుగా మారుతున్నాయని, అందువల్ల విద్యార్థులు, యువత అప్రమత్తంగా ఉండి తమ జీవిత లక్ష్యాలను సాధించడంపై దృష్టి పెట్టాలని సూచించారు.

అనంతరం నారాయణ పేట మండలంలోని అప్పక్ పల్లి వద్ద గల ప్రభుత్వ జిల్లా ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన డ్రగ్స్ డి అడిక్షన్ సెంటర్ ( రీ హాబీటేషన్)ను ఈగల్ ఫోర్స్ ఎస్పీ పీ.వి పద్మజ, కలెక్టర్ ప్రియాంక, ఎస్పీ వినీత్ లు పరిశీలించి డ్రగ్స్ అడిక్షన్ కు గురైన యువకులతో మాట్లాడి వారికి కౌన్సిలింగ్ నిర్వహించారు. డీఎస్పీలు నల్లపు లింగయ్య, బుచ్చయ్య, డీఎంహెచ్‌వో జయచంద్ర మోహన్, సీఐలు శివశంకర్, రామ్‌లాల్, సైదులు, భగవంత్ రెడ్డి, ఎస్‌ఐలు వెంకటేశ్వర్లు, ఆశా వర్కర్లు, ఉపాధ్యాయులు, లెక్చరర్లు, విద్యార్థులు పాల్గొన్నారు.

Narayanpet

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>