కలం, ఖమ్మం బ్యూరో : పేకాట శిబిరంలో పాల్గొంటూ పోలీసులకు చిక్కిన ఏఆర్ కానిస్టేబుల్‌ను సస్పెండ్ చేస్తూ ఖమ్మం (Khammam) పోలీస్ కమిషనర్ సునీల్ దత్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. పోలీసుల కథనం ప్రకారం… జులై 19న వేంసూర్ మండలం అమ్మపాలెం గ్రామ శివారు ప్రాంతంలో కంచర్ల వెంకటేశ్వరరావు (అలియాస్ జయం), శ్రీహరి అనే ఆర్గనైజర్లు నిర్వహిస్తున్న పేకాట స్థావరంపై వేంసూర్ ఎస్సై కవిత తమ సిబ్బందితో కలిసి అకస్మాత్తుగా దాడి చేశారు. ఈ దాడిలో మొత్తం 22 మందిపై కేసు నమోదు చేయగా, సత్తుపల్లి టౌన్ పోలీస్ స్టేషన్‌లో డ్రైవర్‌గా విధులు నిర్వర్తిస్తున్న ఏఆర్ కానిస్టేబుల్ మహమ్మద్ ఇమ్రాన్ షరీఫ్ కూడా పట్టుబడ్డాడు.
విధి నిర్వహణలో తీవ్ర నిర్లక్ష్యం వహించడమే కాకుండా, పోలీసు శాఖా పరమైన నియమావళిని ఉల్లంఘించి అక్రమ కార్యకలాపాల్లో పాల్గొన్నందుకు గాను నిందితుడైన కానిస్టేబుల్ మహమ్మద్ ఇమ్రాన్ షరీఫ్‌ను సస్పెండ్ చేస్తున్నట్లు సీపీ ప్రకటించారు. చట్టాన్ని రక్షించాల్సిన స్థానంలో ఉండి అక్రమాలకు పాల్పడితే ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని, వారిపై కఠిన చర్యలు ఉంటాయని ఈ సందర్భంగా కమిషనర్ హెచ్చరించారు.

