కలం, వెబ్‌డెస్క్: తెలంగాణ ఇంటర్మీడియట్ విద్యా మండలి (Telangana Inter Board) రాష్ట్రంలోని జూనియర్ కాలేజీల విద్యా విధానంలో కీలక సంస్కరణలను ప్రవేశ పెట్టింది. మే 11న విడుదల చేసిన ఇంటర్ అడ్మిషన్ల ప్రకారం మే 12 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్ మొదటి సంవత్సర ప్రవేశాలు ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో కొత్త సంవత్సరం నుంచి విద్యార్థులపై ఒత్తిడి తగ్గించేందుకు , వారి నైపుణ్యాలను పెంపొందించేందుకు వీలుగా పరీక్షల విధానంలో, మార్కుల కేటాయింపులో బోర్డు సంచలన మార్పులు చేపట్టింది.
ఈ కొత్త సంస్కరణల ప్రకారం సైన్స్ సబ్జెక్టులైన ఫిజిక్స్, కెమిస్ట్రీ, బోటనీ, జువాలజీ ప్రాక్టికల్ పరీక్షలను ఇకపై కేవలం ఇంటర్ సెకండ్ ఇయర్‌లోనే కాకుండా ఫస్ట్ ఇయర్‌కు కూడా నిర్వహించనున్నారు. రెండు సంవత్సరాలకు కలిపి 15 మార్కుల చొప్పున మొత్తం 30 మార్కులుగా విభజించారు. అలాగే థియరీ పరీక్షలను 60 మార్కులకు కుదించారు. ఇక గణితం-ఏ, గణితం-బీ, పొలిటికల్ సైన్స్, ఎకనామిక్స్, జియోగ్రఫీ, హిస్టరీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, భాషలు, పార్ట్-III మోడ్రన్ లాంగ్వేజెస్ సబ్జెక్టులలో సరికొత్తగా 20 మార్కులకు యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ విధానంలో ఇంటర్నల్ అసెస్‌మెంట్‌ను ప్రవేశపెట్టారు. దీంతో ఈ సబ్జెక్టులకు ఇంతకు ముందు 100 మార్కులు ఉండగా ఇక 80 మార్కులే ఉండనున్నాయి. అదనంగా ఈ ఏడాది ఏఈసీ ( అకౌంటెన్సీ, కామర్స్, ఎకనామిక్స్) అనే కొత్త గ్రూపును ప్రవేశపెట్టడంతో పాటు ఎంఈసీ విద్యార్థులకు గణితం ప్రత్యేక ప్రశ్నాపత్రాన్ని రూపొందించనున్నారు.
ఈ సంస్కరణలతో పాటు ఇంటర్ ఫస్ట్ ఇయర్ పాఠ్య పుస్తకాలను సబ్జెక్ట్ నిపుణులు కమిటీతో బోర్డు పూర్తిగా పునరుద్ధరించింది. కొత్త పుస్తకాలను ఆకర్షణీయంగా డయాగ్రామ్‌లు, నాలెడ్జ్ బాక్స్‌లు, క్యూఆర్ కోడ్‌లు, భారతీయ విజ్ఞాన వ్యవస్థలు, సిమ్యులేషన్స్‌తో రూపొందించారు. గతంలో కంటే ముందుగానే ఈసారి జూన్ 1వ తేదీ లోపే నూతన పాఠ్య పుస్తకాలు పంపిణీ చేస్తామని ఇంటర్ బోర్డ్ సెక్రెటరీ వెల్లడించారు. విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని బోర్డు ఈ నిర్ణయాలు తీసుకున్నట్లు తెలిపారు.

