కలం, నేషనల్ బ్యూరో: దేశ అవసరాలను దృష్టిలో పెట్టుకుని చక్కెరను ఇతర దేశాలను ఎగుమతి (Sugar Exports) చేయడంపై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించింది. తక్షణం ఈ నిర్ణయం అమల్లోకి వస్తున్నది. సెప్టెంబరు 30 వరకు ఈ నిషేధాజ్ఞలు కొనసాగనున్నాయి. ప్రపంచంలోనే అతిపెద్ద చక్కెర ఉత్పత్తిదారుల్లో ఒకటిగా ఉన్న భారత్ ఎగుమతులపై నిషేధం విధిస్తూ నిర్ణయం తీసుకోవడం సంచలనంగా మారింది. దేశీయంగా పెరుగుతున్న ధరలను అదుపు చేయడానికి, స్థానిక నిల్వలు సరిపడా ఉండేలా చూసేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ అడుగు వేసింది. గతంలో చక్కెర ఎగుమతులను ‘నియంత్రిత’ (రిస్ట్రిక్టెడ్) కేటగిరీలో ఉంచగా ఇప్పుడు ‘నిషేధిత’ జాబితాలోకి మార్చింది. కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ పరిధిలోని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ బుధవారం ఈ మేరకు నోటిఫికేషన్ విడుదల చేసింది.
అన్ని రకాల చక్కెర ఉత్పత్తులు ఈ జాబితాలోకి :
చక్కెర నిషేధం ఏయే రకాలపై వర్తిస్తుందో కూడా ఆ ఉత్తర్వుల్లో డైరెక్టర్ జనరల్ పేర్కొన్నారు. ముడి చక్కెర (రా షుగర్), వైట్ షుగర్, రీఫైన్డ్ షుగర్ తదితర రకాలకు ఈ నిషేధం వర్తించనున్నది. దౌత్యపరమైన ఒప్పందాలు, అంతర్జాతీయ కోటా దృష్ట్యా యూరోపియన్ యూనియన్, అమెరికా దేశాలకు మాత్రం మినహాయింపులు ఇచ్చారు. ఆ దేశాలకు ప్రస్తుతం ఉన్న ‘టారిఫ్-రేట్ కోటా’ ప్రకారమే ఎగుమతులు ఉంటాయి. తాజా నిషేధం ఈ దేశాలకు వర్తించదు. ప్రత్యేక ఒప్పందాల కింద నిర్ణీత పరిమాణంలో చక్కెరను ఆయా దేశాలకు పంపేందుకు ప్రభుత్వం అనుమతించింది. చక్కెర ఎగుమతులపై కఠిన నిర్ణయం తీసుకోవడానికి వెనుక బలమైన కారణాలే ఉన్నాయి. పండుగ సీజన్లు, దేశవ్యాప్తంగా పెరుగుతున్న డిమాండ్ దృష్ట్యా కొరత ఏర్పడకుండా ఈ జాగ్రత్తలు తీసుకున్నది. అంతర్జాతీయంగా చక్కెర ధరలు పెరుగుతుండడంతో ఇక్కడి సామాన్యులపై భారం పడకుండా ధరలను స్థిరీకరించడానికి ఈ నిర్ణయం తీసుకున్నది.
పెట్రోల్ కొరతకు ప్రత్యామ్నాయంగా చక్కరె ఎగుమతులపై నిషేధం విధించాలని కేంద్ర ప్రభుత్వం భావించింది. పెట్రోల్‌లో ఇథనాల్ కలిపే కార్యక్రమానికి ఎక్కువ మొత్తంలో చక్కెర నిల్వలు అవసరమవుతాయి. దీనివల్ల చక్కెరను ఎగుమతి చేయడం కంటే దేశీయ అవసరాలకే ప్రాధాన్యత ఇవ్వాలని భావించింది. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం అంతర్జాతీయ మార్కెట్‌లో చక్కెర ధరలు పెరగడానికి దారితీసే అవకాశం ఉంది. ప్రపంచవ్యాప్తంగా చక్కెర సరఫరాలో భారత్ కీలక పాత్ర పోషిస్తున్నది. అనేక దేశాలు ఇప్పుడు ప్రత్యామ్నాయాల వైపు చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది.

