కలం, వెబ్ డెస్క్ : పరిపాలన వ్యవస్థను మరింత పారదర్శకంగా, వేగవంతంగా ప్రజలకు అందించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం కీలక సంస్కరణలకు శ్రీకారం చుట్టింది. ఈ దిశగా రెవెన్యూ, స్టాంప్స్ రిజిస్ట్రేషన్, సర్వే విభాగాలను ఒకే డిజిటల్ ప్లాట్‌ఫామ్‌పైకి తీసుకువచ్చి ‘భూభారతి’ పోర్టల్‌తో(Bhubharati Portal) అనుసంధానం చేస్తున్నట్లు రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి (Ponguleti Srinivas Reddy) ప్రకటించారు. ఆధునీకరించిన ఈ సమగ్ర భూ పరిపాలన వ్యవస్థను వచ్చే జనవరి నెలలో ప్రజలకు అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపారు.
సోమవారం హైదరాబాద్ నాంపల్లిలోని సెంట్రల్ సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ (సీసీఎల్ఏ) కార్యాలయాన్ని మంత్రి ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం రెవెన్యూ, సర్వే, రిజిస్ట్రేషన్, ఐటీ విభాగాల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ భూ పరిపాలనకు కేంద్రంగా ఉన్న సీసీఎల్‌ఏ కార్యాలయ నిర్వహణ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రజలకు సేవలందించే ఈ కార్యాలయం కార్పొరేట్ స్థాయికి ధీటుగా ఉండాలన్నారు.
మౌలిక సదుపాయాలు, కార్యాలయ వాతావరణం, పనితీరు అన్నింటిలోనూ మార్పు రావాలని అధికారులను ఆదేశించారు. వచ్చే నెలలో మరోసారి కార్యాలయాన్ని తనిఖీ చేస్తానని, అప్పటివరకు స్పష్టమైన మార్పు కనిపించాలన్నారు. అలాగే విభాగాల వారీగా వరుస సమీక్షలు నిర్వహిస్తామని, దీనికి సంబంధించి అధికారులు పూర్తి సమాచారంతో సిద్ధంగా ఉండాలని స్పష్టం చేశారు. భూభారతి పోర్టల్ ద్వారా రైతులు ఒక్క క్లిక్‌తో తమ భూములకు సంబంధించిన పూర్తి సమాచారం పొందేలా వ్యవస్థను రూపొందిస్తున్నట్లు మంత్రి(Ponguleti Srinivas Reddy) వివరించారు.
రిజిస్ట్రేషన్, మ్యుటేషన్, మార్కెట్ విలువ, గ్రామ పటాలు, ప్రతి సర్వే నంబర్‌కు మ్యాప్, నాలా ఆర్డర్లు, ఆర్వోఆర్, గ్రామ నక్షాలు, ఫీడ్‌బ్యాక్ వంటి అన్ని వివరాలు ఒకే చోట లభించేలా సర్వే, రిజిస్ట్రేషన్ విభాగాలతో భూభారతి పోర్టల్‌ను పూర్తిస్థాయిలో అనుసంధానం చేస్తున్నామని చెప్పారు. రెవెన్యూ వ్యవస్థ ఆధునీకరణలో సామాన్యుడి కోణం తప్పనిసరిగా ఉండాలని మంత్రి సూచించారు. ఎలాంటి లోపాలు, తారుమారులకు అవకాశం లేకుండా సాఫ్ట్‌వేర్‌ను అభివృద్ధి చేయాలని, ప్రజలకు నమ్మకాన్ని కలిగించే విధంగా వ్యవస్థ ఉండాలని అధికారులను ఆదేశించారు.
ఈ సమావేశంలో రెవెన్యూ కార్యదర్శి డి.ఎస్. లోకేష్ కుమార్, స్టాంప్స్ & రిజిస్ట్రేషన్ ఐజీ రాజీవ్ గాంధీ హనుమంతు, సి.సి.ఎల్.ఎ ఇన్‌చార్జి కార్యదర్శి మంధా మకరంద్, ఎన్.ఐ.సి. ఎస్.ఐ.ఓ ప్రసాద్, విజయ్‌మోహన్, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
Read Also: ‘కృష్ణా’ వాటాలో కేసీఆర్ మరణశాసనం
Follow Us On: Instagram


