కలం, వెబ్ డెస్క్ : రాష్ట్రంలోని ప్రజల సొంత ఇంటి కలను నెరవేర్చడంలో తనదైన ముద్ర వేసుకున్న హౌసింగ్ బోర్డు ప్రత్యేకంగా ఎల్ఐజీ వర్గాల (లోయర్ ఇన్ కం గ్రూప్) (LIG) కోసం ప్లాట్‌లను (Flats Offer) అందుబాటులోకి తెచ్చింది. హైదరాబాద్, ఖమ్మం, వరంగల్ ప్రాంతాల్లోని మొత్తం 339 ప్లాట్‌లను అందుబాటులోని ధరలతో ఎక్కడ ఉన్నవి అలానే అన్న ప్రాతిపదికన విక్రయిస్తున్నది. అల్పాదాయ వర్గాల ప్రజలకు (LIG) మంచి వసతులతో కూడిన సొంత ఇంటి వసతిని కల్పించాలన్న ఉద్దేశ్యంతో ఇప్పటికే అనేక కుటుంబాలు నివసిస్తున్న గేటెడ్ కమ్యూనిటీ – అపార్ట్ మెంట్ లలోని ప్లాట్‌లను ఆ వర్గాలకు చెందిన వారికే కేటాయించాలనే నిర్ణయం తీసుకున్నట్లు హౌసింగ్ బోర్డు వైస్ చైర్మన్ వీపీ గౌతం ఓ ప్రకటనలో తెలిపారు. ఇవన్నీ కూడా అభివృద్ధి చెందిన, అత్యధిక డిమాండ్ ఉన్న ప్రాంతాల్లోని ప్లాట్ అని బహిరంగ మార్కెట్ కంటే చాలా తక్కువ ధరలతో విక్రయిస్తున్నట్లు ఆయన తెలిపారు.
వివిధ ప్రైవేటు సంస్థల భాగస్వామ్యంతో హౌసింగ్ బోర్డు నిర్మించిన అపార్ట్ మెంట్ లలోని ఈ ఫ్లాట్‌లను ప్రత్యేకించి అఫర్డబుల్ హౌసింగ్ కింద అల్పాదాయ వర్గాల ప్రజల సొంత ఇంటి కలను నెరవేర్చాలన్న లక్ష్యంతో ఏడాదికి ఆరు లక్షల రూపాయల (నెలకు రూ.50 వేలు ) ఆదాయం ఉన్న వారికే వీటిని కేటాయించాలనే నిర్ణయం తీసుకున్నారు. హైదరాబాద్ గచ్చిబౌలి లోని 111 ఫ్లాట్లు, వరంగల్ రైల్వే స్టేషన్ సమీపంలోని అపార్ట్ మెంట్ లో 102 నూ, ఖమ్మంలో శ్రీరామ్ హిల్స్ వద్ద 126 ఫ్లాట్లు అందుబాటులో ఉన్నాయని వైస్ చైర్మన్ విపి గౌతం వెల్లడించారు. వీటిని కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతూ దరఖాస్తు చేసుకున్న వారికి పూర్తి పారదర్శకమైన విధానంలో లాటరీ పద్ధతిలో కేటాయిస్తామని చెప్పారు.
ఫ్లాట్ల విస్తీర్ణం 450 చదరపు అడుగుల నుంచి 650 చదరపు అడుగుల వరకు ఉన్నదనీ, గచ్చిబౌలి ప్రాంతంలోని ప్లాట్ ధర రూ.26 లక్షల నుంచి గరిష్టంగా 36.20 లక్షల వరకు మాత్రమే ఉన్నదని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. అలాగే ఖమ్మం, వరంగల్ లో రూ.19 -21.50 లక్షలకు, ఖమ్మంలో రూ.11.25 లక్షలకే అందుబాటులోకి తెచ్చామన్నారు. ఈ ప్రాంతాల్లోని ప్లాట్‌లను కొనుగోలు చేయడానికి ఆసక్తి ఉన్న వారు ఆన్ లైన్ లోనూ, మీ సేవా కేంద్రాల్లోనూ దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. గచ్చిబౌలి ప్రాంతం ఫ్లాట్ల కేటాయింపు లాటరీ ప్రక్రియ జనవరి 6 వ తేదీన, వరంగల్ లోని ఫ్లాట్ల కేటాయింపు జనవరి 8న, ఖమ్మం ఫ్లాట్ల లాటరీ జనవరి 10 వ తేదీన నిర్వహించనున్నారు. ఈ విక్రయాలకు సంబంధించిన వివరాలన్నీ హౌసింగ్ బోర్డు(Housing Board) వెబ్ సైట్ https://tghb.cgg.gov.in లో అందుబాటులో ఉంటాయి.
Read Also: గూగుల్ జెమిని వాడొద్దంటున్న ఆ సంస్థ ఫౌండర్
Follow Us On : WhatsApp


